విరాట్ కోహ్లితో పృథ్వీ షా
Scared To Share My Thoughts: ‘‘జట్టు నుంచి నన్నెందుకు తప్పించారో తెలియదు. అందుకు గల కారణం తెలియక సతమతమయ్యా. కొంతమందేమో ఫిట్‌నెస్ లేదు కాబట్టే నిన్ను తప్పించి ఉంటారు అని చెప్తారు. నిజానికి నేను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి అన్ని పరీక్షల్లోనూ పాస్ అయ్యాను.
ఆ తర్వాత మళ్లీ మైదానంలో దిగి పరుగులు సాధించాను. ఈ క్రమంలో నాకు టీ20 జట్టులో స్థానం దక్కింది. కానీ వెస్టిండీస్‌తో సిరీస్‌లకు మాత్రం నన్ను పక్కనపెట్టారు. ఇలాంటి పరిణామాల వల్ల నిరాశ చెందడం సహజం. ఏ ఆటగాడైనా నాలాగే బాధ పడతాడు.
నా పరిధిలో నేనుంటా
కానీ మనం ఏం చేయలేం కాబట్టి ముందుకు సాగిపోవాలంతే! నన్ను ఎందుకు ఎంపిక చేయలేదని ఎవరినైనా అడిగే పరిస్థితి గానీ, వాళ్లతో పోరాడే శక్తి గానీ నాకు లేవు. ఓ మనిషిగా నాకు సౌకర్యవంతంగా ఉండేలా నా పరిధిలో నేనుంటాను. కానీ కొంతమంది నా గురించి వాళ్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు.
అయితే, నన్ను దగ్గరగా చూసిన వాళ్లకు మాత్రమే నేనేంటో తెలుస్తుంది. నాకు స్నేహితులెవరూ లేదు. ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయాలన్న ఆలోచన కూడా లేదు. ప్రస్తుత తరంలో చాలా మంది ఇలాగే ఆలోచిస్తున్నారు. మన మనసులోని భావాలు పక్కవాళ్లతో పంచుకోవాలంటే నాకైతే భయం వేస్తుంది.
మనమొకటి మాట్లాడితే వాళ్లు మాత్రం
మనమొకటి మాట్లాడితే కొంతమంది దానిని సోషల్ మీడియాకెక్కిస్తారు. నిజానికి నాకు ఫ్రెండ్స్ అని చెప్పుకొనేందుకు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్లతో కూడా నేను ఎక్కువగా మాట్లాడను. కొన్ని విషయాలు మాత్రమే పంచుకుంటాను’’ అని టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా అన్నాడు.
ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం తనకు ఇష్టం ఉండదని.. మనం చెప్పిన మాటలను వక్రీకరించే వాళ్లే ఎక్కువగా ఉంటారని ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. కాగా భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన పృథ్వీ షా 2018లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.
గిల్ దూసుకుపోతోంటే.. షా మాత్రం
ఆరంభంలో అవకాశాలు అందిపుచ్చుకున్నప్పటికీ ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఈ ముంబై బ్యాటర్ ఆశించిన మేర రాణించలేకపోయాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నప్పటికీ తన సారథ్యంలో ఆడిన శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి సమకాలీన ఆటగాళ్ల నుంచి పోటీ ఎక్కువవడంతో జాతీయ జట్టులో అతడికి చోటు కరువైంది.
ఈ నేపథ్యంలో పృథ్వీ షా ఆఖరిసారి శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ఆడాడు. తర్వాత జట్టుకు ఎంపికైనా ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఈ క్రమంలో వెస్టిండీస్ పర్యటనకు కూడా సెలక్టర్లు అతడిని ఎంపికచేయలేదు. ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీ షా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన పృథ్వీ షా 8 మ్యాచ్‌లు ఆడి కేవలం 106 పరుగులు సాధించాడు. ఇక సప్నా గిల్ అనే మోడల్‌తో వివాదం కూడా అతడి కెరీర్‌పై గట్టిగానే ప్రభావం చూపిందని అతడి మాటలను బట్టి అర్థమవుతోంది.
చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. వెస్టిండీస్ జట్టు ప్రకటన! యువ సంచలనం ఎంట్రీ
వచ్చేస్తున్నానని వాళ్లకు చెప్పండి: బుమ్రా భావోద్వేగం.. బీసీసీఐ స్పందన
Comments
Please login to add a commentAdd a comment