Shubman Gill Again Fails IND vs WI 2nd Test Leads To Pointing Out Reasons: వెస్టిండీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ వైఫల్యం కొనసాగుతోంది. మేనేజ్‌మెంట్‌ను రిక్వెస్ట్ చేసి.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌ను ఒప్పించిన ఈ రెగ్యులర్ ఓపెనర్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న విషయం తెలిసిందే.
అయితే, ఏరికోరి ఎంచుకున్న స్థానంలో సఫలం కాలేక గిల్ విమర్శల పాలవుతున్నాడు. డొమినికా వేదికగా తొలి టెస్టులో 11 బంతులు ఎదుర్కొన్న ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ కేవలం 6 పరుగులు చేశాడు. విండీస్ స్పిన్నర్ వారికన్ బౌలింగ్‌లో అలిక్ అథనాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
వరుస వైఫల్యాలు
ట్రినిడాడ్‌లోని రెండో టెస్టులోనైనా రాణిస్తాడనుకుంటే మళ్లీ నిరాశ పరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 12 బంతులు ఎదుర్కొని 10 పరుగులు మాత్రమే రాబట్టాడు. కరేబియన్ పేసర్ కీమర్ రోచ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జాషువా డా సిల్వాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ ఆట తీరుపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఏరికోరి వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రావడాన్ని ఉద్దేశించి.. ‘‘విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..
నెట్టింట పేలుతున్న సెటైర్లు
శుబ్‌మన్ గిల్.. రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడి ఇకపై అన్ని మ్యాచ్‌లు అహ్మదాబాద్ స్టేడియంలో జరిగేలా చూడాలని కోరాడు. నేను అహ్మదాబాద్ పిచ్‌లపై మాత్రమే బ్యాటింగ్ చేయగలను. అందుకే ఈ సాయం చేయగలరు అని అభ్యర్థించాడు’’ అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.
అహ్మదాబాద్ పిచ్ ఎందుకంటే
కాగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబీ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తన కెరీర్‌లో గత మూడు సెంచరీలు చేయడంవిశేషం. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో శతకం బాదిన అతడు.. న్యూజిలాండ్‌తో టీ20లోనూ సెంచరీ కొట్టాడు. ఇక ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో శతక్కొట్టాడు.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ఈ మేరకు గిల్‌ను ట్రోల్ చేయడం గమనార్హం. కాగా విండీస్‌తో రెండో టెస్టులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మెరుగైన స్థితిలో ఉంది. గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
ఇక అంతర్జాతీయ కెరీర్‌లో 500వ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లి 87, రవీంద్ర జడేజా 36 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో గిల్‌తో పాటు విఫలమైన టీమిండియా వైస్ కెప్టెన్ రహానే మలి టెస్టులోనూ అతడి మాదిరే వైఫల్యం చెంది విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.
చదవండి: సన్‌రైజర్స్ హెడ్‌కోచ్‌గా వీరేంద్ర సెహ్వాగ్.. ఇక తిరుగుండదు!
Ind vs WI: ధోని భయ్యా లేడు కదా.. ఇలాగే ఉంటది! ఇప్పటికైనా వాళ్లను పిలిస్తే..
Comments
Please login to add a commentAdd a comment