భారత క్రికెట్ దిగ్గజాల్లో ముఖ్యుడైన లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తన సమకాలీకులైన దిలీప్ వెంగ్‌సర్కార్, మహ్మద్ అజహారుద్దీన్‌లను ఏకి పారేశాడు. ఇటీవల ప్రకటించిన భారత టీ20 ప్రపంచకప్-2022 జట్టుపై ఆ ఇద్దరు చేసిన వ్యతిరేక కామెంట్స్‌కు సన్నీ ఘాటుగా బదులిచ్చాడు. ఆటగాళ్ల ఎంపిక జరిగాక వారిపై వ్యతిరేక కామెంట్లు చేసేందుకు బుద్ధి, జ్ఞానం ఉండాలని పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ ధ్వజమెత్తాడు. ఒకరి బదులు ఇంకొకరిని ఎంపిక చేసుంటే బాగుండేదని కామెంట్స్ చేసే ముందు ఓసారి ఆలోచించి ఉంటే బాగుండేదని గడ్డిపెట్టాడు.
ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల అంతర్జాతీయంగా మన దేశ పరువు దిగజారడంతో పాటు ఆటగాళ్లను నైతికంగా నిరుత్సాహపరిచినవారమవుతామంటూ మొట్టికాయలు వేశాడు. జట్టు ఎంపికపై అసంతృప్తి ఉన్నా దానిపై బహిరంగా కామెంట్ చేయకూడదన్న ఇంగిత జ్ఞానం ఉండాలని వాయించాడు. సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా పని చేసిన అనుభవమున్న వారు జట్టు ఎంపిక తర్వాత ఆటగాళ్లను నిరుత్సాహపరిచే విధంగా కామెంట్లు చేయడమేంటని నిలదీశాడు.
వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలకు జట్టును ఎంపిక చేసేప్పుడు సవాలక్ష సమీకరణలు ఉంటాయని, భారతీయులుగా మనం సెలెక్టర్ల ఛాయిస్‌కు గౌరవమివ్వాలి కాని, ఒకరి స్థానంలో ఇంకొకరిని ఎంపిక చేసుంటే బాగేండేదంటూ కామెంట్లు చేయకూడదని చురకలంటించాడు. జట్టు ఎంపిక ఏ ప్రాతిపదికన జరిగినా వెనకేసుకురావాలి కానీ మన వీక్‌నెస్‌ను మనమే బహర్గతం చేసుకోకూడదని సూచించాడు.
ఇదే సందర్భంగా సన్నీ రోహిత్ నేతృత్వంలో ఎంపిక చేయబడ్డ భారత వరల్డ్‌కప్ స్క్వాడ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత వరల్డ్ కప్ జట్టు సమతూకంగా చాలా బాగుందని, ఈసారి హిట్‌మ్యాన్ సేన ఎలాగైనా టైటిల్ సాధించి మెగా టోర్నీల్లో భారత్ రాణించలేదన్న అపవాదును తొలగించాలని ఆకాంక్షించాడు. ఇందుకు కొద్దిగా లక్ కూడా తోడైతే టీమిండియాను ఆపడం ఎవరి వల్ల కాదని అభిప్రాయపడ్డాడు. భారత్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గాక ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా సాధించని విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, భారత సెలెక్టర్లు టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్ వ్యతిరేక కామెంట్లు చేశాడు. వరల్డ్ కప్ మెయిన్ జట్టులో శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ పేర్లు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, జట్టులో స్థానం పొందిన వారిలో దీపక్ హుడా, హర్షల్ పటేల్‌లను తప్పించి శ్రేయస్, షమీలకు ఛాన్స్ ఇస్తే బాగుండేదని ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
అజహార్ వ్యాఖ్యలకు వంత పాడుతూ వెంగసర్కార్ సైతం కొద్ది రోజుల తర్వాత ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తనైతే షమీ, ఉమ్రాన్ మాలిక్, శుభ్‌మన్ గిల్‌లను ఎంపిక చేసే వాడినని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment