రోహిత్ శర్మ (ఫైల్ ఫొటో)
India vs England, 4th Test- Rohit Sharma Comments After Series Win: భారత గడ్డపై కూడా తగ్గేదేలేదు అంటూ దూకుడు ప్రదర్శించాలనుకున్న ఇంగ్లండ్‌కు టీమిండియా కళ్లెం వేసింది. ఉపఖండంలో ఇలాంటి పప్పులు ఉడకవంటూ ‘బజ్‌బాల్’ పగిలేలా వరుస విజయాలతో మోత మోగించింది.
నాలుగో మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటలోనే ఫలితం తేల్చి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఆరంభ మ్యాచ్‌లో తడ‘బ్యా’టుకు గురైనా.. హ్యాట్రిక్ విజయాలతో సొంతగడ్డపై ఆధిపత్యాన్ని చాటుకుంది.
విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్లు లేకపోయినా కుర్రాళ్లు ఆ లోటును తీర్చి జట్టును విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా బ్యాటర్లు ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తమదైన ముద్ర వేయగలిగారు.
ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లే అధికంగా ఉన్న జట్టుతో ఇంగ్లండ్ వంటి పటిష్ట జట్టుపై విజయం సాధించడం పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈ సిరీస్ ఆసాంతం గెలుపు కోసం మేము ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. అయినా.. నాలుగో టెస్టులోనే సిరీస్ ఫలితం తేల్చగలిగాం. కుర్రాళ్ల ఆట తీరు పట్ల నాకు గర్వంగా ఉంది.
మేము సాధించిన విజయాల పట్ల చాలా చాలా సంతోషంగా ఉన్నాను. స్థానిక, దేశవాళీ క్రికెట్‌లో రాణించిన ఆటగాళ్లు ఇక్కడ ఇలాంటి అద్భుతాలు చేయగలరో చూపించారు టెస్టు క్రికెట్‌లో రాణించాలంటే కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీళ్లు అవన్నీ దాటుకుని ఇక్కడి దాకా వచ్చి తమను తాము నిరూపించుకున్నారు.
ఈ మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో మరింత పరిణతితో ఆడాడు. కూల్‌గా, కామ్‌గా తన పని పూర్తి చేశాడు’’ అని రోహిత్ శర్మ.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌పై ప్రశంసలు కురిపించాడు.
ఇది సమిష్టి విజయమని.. కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైనా ఇలాంటి గెలుపు రుచి చూడటం ఎంతో ఆనందంగా ఉందని రోహిత్ పేర్కొన్నాడు. డ్రెస్సింగ్‌రూం వాతావరణం బాగానే ఉన్నా.. బయట తమ జట్టు గురించి వచ్చే వార్తలు, చేసే వ్యాఖ్యలు కుర్రాళ్లపై కాస్త ఒత్తిడి పెంచాయని తెలిపాడు.
అయితే, ఒత్తిడిని జయించి అద్బుత ప్రదర్శనలతో వారు తమను నిరూపించుక్ను తీరు అమోఘమని రోహిత్ శర్మ ఈ సందర్భంగా కొనియాడాడు. ఆఖరి టెస్టులోనూ గెలుపొంది 4-1తో ట్రోఫీని అందుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మార్చి 7 నుంచి నామమాత్రపు ఐదో టెస్టు జరుగనుంది.
A fantastic victory in Ranchi for #TeamIndia 😎
— BCCI (@BCCI) February 26, 2024
India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏
Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d
Comments
Please login to add a commentAdd a comment