వరల్డ్‌ రికార్డుపై కన్నేసిన షమీ.. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడంటే.. | Ind vs Eng: Shami Needs 5 Wickets In 1st ODI To Create World Record | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ రికార్డుపై కన్నేసిన షమీ.. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడంటే..

Published Sat, Jan 11 2025 9:52 PM | Last Updated on Sat, Jan 11 2025 10:00 PM

Ind vs Eng: Shami Needs 5 Wickets In 1st ODI To Create World Record

టీమిండియా సీనియర్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ(Mohammed Shami) అరుదైన ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో గనుక అతడు రాణిస్తే.. మిచెల్‌ స్టార్క్‌ పేరిట ఉన్న అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంటాడు. కాగా వన్డే ప్రపంచకప్‌-2023లో షమీ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే.

కాస్త ఆలస్యంగా ఈ మెగా టోర్నీలో ఎంట్రీ ఇచ్చినా.. వికెట్ల వేటలో మాత్రం దూసుకుపోయాడు షమీ. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో ఏకంగా 24 వికెట్లు కూల్చి.. లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. అయితే, వరల్డ్‌కప్‌ మధ్యలోనే చీలమండ నొప్పి వేధించినా లెక్కచేయని షమీ.. టోర్నీ ముగిసిన తర్వాత మాత్రం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక
ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాసం పొందిన షమీ.. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి దాదాపు ఏడాది కాలం పట్టింది. అయితే, ఇప్పటి వరకు అతడు టీమిండియాలో పునరాగమనం చేయలేకపోయాడు. తొలుత దేశవాళీ టీ20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టోర్నీలో బెంగాల్‌ తరఫున బరిలోకి దిగిన ఈ పేస్‌ బౌలర్‌.. పదకొండు వికెట్లతో సత్తా చాటాడు.

అనంతరం దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలోనూ ఆడి తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో షమీ స్థానం దక్కించుకున్నాడు. సొంతగడ్డపై జరిగే ఈ సిరీస్‌ సందర్భంగా అతడు రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఇంగ్లండ్‌తో వన్డేల్లోనూ షమీ చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయమైంది.

ఈ నేపథ్యంలో షమీని ఓ వరల్డ్‌ రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో అతడు ఐదు వికెట్లు తీస్తే చాలు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్‌లో చేరిన మొదటి క్రికెటర్‌గా నిలుస్తాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ పేరిట ఉంది.

షమీ ఇప్పటికి 100 ఇన్నింగ్స్‌లో
స్టార్క్‌ 102 ఇన్నింగ్స్‌లో 200 వికెట్ల మార్కును అందుకున్నాడు. అయితే, షమీ ఇప్పటికి 100 ఇన్నింగ్స్‌లో 195 వికెట్లు పడగొట్టాడు. కాబట్టి తదుపరి ఆడబోయే వన్డేలో షమీ ఐదు వికెట్లు తీశాడంటే.. స్టార్క్‌ వరల్డ్‌ రికార్డును అతడు బద్దలుకొడతాడు. ఇక భారత్‌ తరఫున అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్‌లో చేరిన బౌలర్‌గా.. టీమిండియా ప్రస్తుత చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ కొనసాగుతున్నాడు. అతడు 133 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ అందుకున్నాడు.

కాగా టీమిండియా ఇంగ్లండ్‌తో జనవరి 22- ఫిబ్రవరి 2 వరకు ఐదు టీ20లు ఆడనుంది. అనంతరం.. ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్‌ మొదలుకానుంది. ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో తొలి వన్డే, ఫిబ్రవరి 9న కటక్‌లో రెండో వన్డే, ఫిబ్రవరి 12న మూడో అహ్మదాబాద్‌లో మూడో వన్డే జరుగనున్నాయి.

వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల క్లబ్‌లో చేరిన బౌలర్లు వీరే
1. మిచెల్‌ స్టార్క్‌- 102 మ్యాచ్‌లలో
2. సక్లెయిన్‌ ముస్తాక్‌- 104 మ్యాచ్‌లలో
3. ట్రెంట్‌ బౌల్ట్‌- 107 మ్యాచ్‌లలో
4. బ్రెట్‌ లీ- 112 మ్యాచ్‌లలో
5. అలెన్‌ డొనాల్డ్‌- 117 మ్యాచ్‌లలో.

చదవండి: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్‌స్టార్‌పై వేటు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement