ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన తొలి టీ20(India vs England) మ్యాచ్‌లో టీమిండియా అభినుల అందరి దృష్టి పేస్ బౌలర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) పైనే నిలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడా(India Beat England)తో సునాయాసంగా విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా.. అయిదు మ్యాచ్‌లో సిరీస్‌లో శుభారంభం చేసింది.
అయితే దాదాపు పద్నాలుగు నెలల తర్వాత ఈ మ్యాచ్ ద్వారా మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు షమీ సిద్ధంగా ఉన్నాడు. కానీ బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో షమీని భారత్ తుది జట్టు నుంచి తప్పించారు. సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డితో పాటు భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌తో రంగంలోకి దిగింది.
షమీ ఎందుకు ఆడలేదు?
కానీ ఎందుకు షమీ ఆడలేదు? అతను పూర్తి ఫిట్‌నెస్ తో లేడా? అలాంటప్పుడు అసలు జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారు? ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి షమీ మ్యాచ్ ప్రాక్టీస్ చేయడానికి ఇదొక చక్కని అవకాశం.
జట్టులోని ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పై అనుమానాలు ఉన్న సమయంలో షమీ మ్యాచ్ ప్రాక్టీస్ తో పూర్తిగా సిద్ధమవడం భారత్ జట్టు ప్రయోజనాల దృష్ట్యా చాలా కీలకం. దీని వెనుక కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాత్మక ఎత్తుగడ ఏమైనా ఉందా అన్న ప్రశ్నఅందరి లో తలెత్తకమానదు.
ఎందుకంటే మ్యాచ్ కి కొద్దీ సేపు ముందు జరిగిన తుది ప్రాక్టీస్ లో షమీ బౌలింగ్ చేయడం ఈడెన్ గార్డెన్స్ లోని ప్రేక్షకులందరూ ప్రత్యక్షంగా చూసారు. షమీ పూర్తి స్థాయి లో బౌలింగ్ చేయకపోయినా ఎలాంటి అసౌకర్యంతో ఉన్నట్టు కన్పించలేదు. మ్యాచ్ కి ముందు వార్మప్‌లలో బౌలింగ్ చేశాడు. దీంతో అతను పూర్తి ఫిట్‌నెస్ తో ఉన్నట్టు తేటతెల్లమైంది.
మరి ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ ఓపెనర్‌లో షమీ ఎందుకు ఆడలేదు? మ్యాచ్ కి ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మేము పిచ్ ని దృష్టిలో ఉంచుకొని తుది జట్టుని నిర్ణయించాం. అందుకే షమీ ఈ మ్యాచ్ లో ఆడటంలేదని చెప్పాడు. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోకి దిగడం విశేషం.
ఫిట్‌గా లేడేమో?
కాగా షమీ చివరిసారి 2023 నవంబర్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో అతని చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. "షమీ ఆడటం లేదు అంటే అతను ఈ మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్ నెస్ తో లేడని స్పష్టంగా తెలుస్తోంది.
అర్ష్‌దీప్ రూపంలో భారత్ ఒక ఫ్రంట్‌లైన్ పేసర్‌ను మాత్రమే ఆడించాలని నిర్ణయించుకుంది. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరూ పేస్ బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ఆల్రౌండర్లు. ఇంగ్లాండ్ ఇందుకు భిన్నంగా నాలుగు పేసర్లను రంగంలోకి దించింది" అని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.
పరిస్థితులకు అనుగుణంగానే
ఈ మ్యాచ్ లో 34 బంతుల్లో 79 పరుగులు చేసిన భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనంతరం మాట్లాడుతూ, పరిస్థితుల ఆధారంగా జట్టు యాజమాన్యం షమీ నిర్ణయం తీసుకుందని అన్నాడు. "ఇది జట్టు యాజమాన్యం నిర్ణయం అని నేను భావిస్తున్నాను. పిచ్ పరిస్థితుల అనుగుణంగా చూసినట్టయితే ఇదే సరైన నిర్ణయమని వారు భావించారు" అని మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో అభిషేక్ అన్నాడు.
గంభీర్ నిర్ణయమేనా?
ఇది పూర్తిగా కోచ్ గంభీర్ నిర్ణయంలాఅనిపిస్తోంది. జట్టులో ఉన్న స్టార్ సంస్కృతికి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని భావించాల్సి ఉంటుంది. భారత్ జట్టు ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించిన దృష్ట్యా చూస్తే ఈ వ్యూహం ఫలించిందని చెప్పాలి.
ఇక షమీని తప్పించిన విషయాన్ని పక్కన పెడితే , ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై సరైన నిర్ణయమే అని రుజువైంది. మరి రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కి ఈ సిరీస్ సన్నాహక టోర్నమెంట్ గా భావిస్తున్న నేపథ్యంలో షమీ ఆడటం చాలా కీలకం. చెన్నై లో జరిగే రెండో మ్యాచ్ లో షమీ రంగప్రవేశం చేస్తాడేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment