రోహిత్ శర్మ (PC: BCCI)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ చరిత్రలో సారథిగా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకునే అరుదైన అవకాశం ముంగిట హిట్‌మ్యాన్ నిలిచాడని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో ఓపెనర్‌గా, కెప్టెన్‌గా రాణిస్తే గొప్ప నాయకుడిగా నీరజనాలు అందుకుంటాడని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత రోహిత్ శర్మ సెలవులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా బాక్సింగ్ డే టెస్టుతో పునరాగమనం చేయనున్నాడు. ఇక సఫారీ గడ్డపై ఇంత వరకు టీమిండియా కెప్టెన్లు ఎవరూ కూడా టెస్టు సిరీస్ గెలిచిన దాఖలాలు లేవు.
మేటి టెస్టు సారథిగా పేరొందిన విరాట్ కోహ్లికి కూడా సంప్రదాయ క్రికెట్‌లో ప్రొటిస్ జట్టు పైచేయి సాధించడం సాధ్యం కాలేదు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన తర్వాత 2021-22 టూర్‌లో కోహ్లి సారథ్యంలో భారత్ ఆరంభ టెస్టు గెలిచి ఆశలు రేకెత్తించింది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత కోహ్లి అనూహ్యంగా టెస్టు సారథ్యానికి గుడ్‌బై చెప్పడంతో కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, మిగిలిన రెండు టెస్టుల్లో టీమిండియాకు ఓటమే ఎదురైంది. 2-1తో మరోసారి సౌతాఫ్రికాకు ట్రోఫీని సమర్పించుకుంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుత టూర్ రోహిత్ శర్మకు సవాలుగా నిలవడంతో పాటు తనను తాను నిరూపించుకునే అవకాశాన్నీ ఇచ్చింది. ఈ విషయం గురించి ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ గనుక సౌతాఫ్రికా గడ్డపై సఫారీలను చిత్తు చేయగలిగితే.. భారత క్రికెట్ కెప్టెన్ల జాబితాలో శిఖరాగ్రాన నిలిచే అవకాశం ఉంటుంది.
సారథిగా రెండంటే.. రెండు మ్యాచ్‌లు గెలిస్తే చాలు అతడు చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు. ఓపెనర్‌గా, కెప్టెన్‌గా రోహిత్ రాణిస్తే ఇదేమీ అసాధ్యం కాదు. కొత్తబంతిపై షైనింగ్ పోయేంత వరకు హిట్‌మ్యాన్ క్రీజులో ఉంటే.. మిగతా బ్యాటర్ల పని సులువవుతుంది.
ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ అద్భుతంగా ఆడాడు. అదే ప్యాషన్‌తో సౌతాఫ్రికాలో ఆడితే వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టగలడు. టీమిండియాకు ప్రస్తుతం ఇద్దరు పెద్దన్నలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఉన్నారు. వారి ప్రదర్శనపైనే సిరీస్ గెలుస్తామా లేదా అన్న విషయాలు ఆధారపడి ఉంటాయి’’ అని అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలవాలని ఇర్ఫాన్ పఠాన్ ఈ సందర్భంగా ఆకాంక్షించాడు.
Comments
Please login to add a commentAdd a comment