జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 47 బంతుల్లో (7 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 నాటౌట్; 11 ఫోర్లు, సిక్సర్), రింకూ సింగ్ (22 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ (2 వికెట్ల నష్టానికి 234 పరుగులు) చేసింది.
అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే.. ముకేశ్ కుమార్ (3.4-0-37-3), ఆవేశ్ ఖాన్ (3-0-15-3), రవి బిష్ణోయ్ (4-0-11-2), వాషింగ్టన్ సుందర్ (4-0-28-1) ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని (100 పరుగుల తేడాతో) మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్.. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్, జింబాబ్వే చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ జులై 10న జరుగనుంది.
𝙃𝙖𝙫𝙤𝙘 𝙞𝙣 𝙃𝙖𝙧𝙖𝙧𝙚 🌪️🏏@IamAbhiSharma4 smashes 100 in 47 balls 🥵💪#SonySportsNetwork #ZIMvIND #TeamIndia pic.twitter.com/hHYlTopD1V
— Sony Sports Network (@SonySportsNetwk) July 7, 2024
ఇదిలా ఉంటే, రెండో టీ20లో సుడిగాలి శతకంతో (46 బంతుల్లో) విరుచుకుపడిన అభిషేక్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఫీట్‌ను సాధించాడు. కెరీర్‌లో కేవలం రెండో టీ20 ఆడుతున్న అభిషేక్.. సెంచరీ మార్కును హ్యాట్రిక్ సిక్సర్లతో (వెల్లింగ్టన్ మసకద్జ బౌలింగ్‌లో) అందుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్ కూడా అంతర్జాతీయ శతకాన్ని హ్యాట్రిక్ సిక్సర్లతో అందుకోలేదు.
ఈ మ్యాచ్‌లో అభిషేక్ తన పరుగుల ఖాతాను కూడా సిక్సర్‌తోనే ఓపెన్ చేయడం విశేషం. తన కెరీర్ తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన అభిషేక్ రెండో మ్యాచ్‌లోనే సెంచరీ చేసి పలు రికార్డులు కొల్లగొట్టాడు.
అభిషేక్ సాధించిన రికార్డులు ఇవే..
అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా(ఇన్నింగ్స్‌ల పరంగా) సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. అభిషేక్ కేవలం రెండు ఇన్నింగ్స్‌ల వ్యవధిలోనే తన మొదటి అంతర్జాతీయ సెంచరీని సాధించాడు.అభిషేక్‌కు ముందు ఈ రికార్డు దీపక్ హుడా పేరిట ఉండేది. హుడా తన కెరీర్ మూడో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.
అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున సెంచరీ చేసిన ఐదో అత్యంత పిన్న వయస్కుడిగా అభిషేక్ నిలిచాడు. అభిషేక్ 23 ఏళ్ల 307 రోజుల వయస్సులో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ జాబితాలో యశస్వీ జైశ్వాల్ (21 ఏళ్ల 279 రోజుల వయస్సులో) టాప్‌లో ఉన్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(38 బంతులు) అగ్రస్ధానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్(45), కేఎల్ రాహుల్(46), అభిషేక్ శర్మ(46) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా అభిషేక్ రికార్డులకెక్కాడు. ఈ ఏడాది టీ20ల్లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్.. 50 సిక్స్‌లు బాదాడు. అభిషేక్‌కు ముందు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (25 మ్యాచ్‌ల్లో 46 సిక్స్‌లు) పేరిట ఉండేది.
ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో 65 పరుగులు సాధించిన అభిషేక్.. అంతర్జాతీయ టీ20ల్లో స్పిన్నర్లపై అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అభిషేక్‌కు ముందు ఈ రికార్డు యువరాజ్ సింగ్ (57 పరుగులు) పేరిట ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment