మరికొద్ది గంటల్లో టీమిండియా, వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న రోహిత్ సేన సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. తొలి టెస్టులో కనీసం రెండు వందల పరుగుల మార్క్‌ను అందుకోవడంలో విఫలమైన విండీస్ కనీసం ఈసారైనా తన స్కోరును 200 దాటిస్తుందేమో చూడాలి. ఓపెనర్‌గా యశస్వి జైశ్వాల్ అరంగేట్రం టెస్టులోనే అదరగొట్టాడు. తాను ఆడుతున్న తొలి టెస్టులోనే సెంచరీతో మెరిసి ఎవరికి సాధ్యం కాని రికార్డులను అందుకున్నాడు.
ఇక సిరీస్ డిసైడ్ చేసే రెండో టెస్టులో టీమ్ ఎలా ఉండబోతోంది? మరో ప్లేయర్ అరంగేట్రం ఖాయమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తొలి టెస్టులో యశస్వికి అవకాశం ఇచ్చినట్లే.. ఈ రెండో టెస్టులో పేస్ బౌలర్ ముకేశ్ కుమార్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో ముకేశ్ ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మిగతా జట్టులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. గురువారం (జులై 20) నుంచి వెస్టిండీస్ తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.
శార్దూల్ బ్యాట్ తోనూ రాణించే ప్లేయరే అయినా.. ఇప్పటికే జట్టులో జడేజా, అశ్విన్ లాంటి ఆల్ రౌండర్లు ఉండటంతో అతని స్థానంలో ముకేశ్ ను తీసుకునే స్వేచ్ఛ కెప్టెన్ రోహిత్ కు ఉంది. ఇక వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ నే కొనసాగించనున్నారు. తొలి టెస్టుతోనే ఇషాన్ తన టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో బ్యాట్ తో తనను తాను నిరూపించుకునే అవకాశం అతనికి రాలేదు.
అంతేకాదు మూడోస్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్, చాలా రోజుల తర్వాత ఇండియన్ టీమ్ లోకి వచ్చిన అజింక్య రహానే కూడా విఫలమయ్యారు. వీళ్లు రెండో టెస్టులో రాణించాల్సి ఉంది. పేస్ బౌలింగ్ లో సిరాజ్, జైదేవ్ ఉనద్కట్ తుది జట్టులో కొనసాగనున్నారు.
టీమిండియా తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అశ్విన్, శార్దూల్ ఠాకూర్/ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనద్కట్, మహ్మద్ సిరాజ్
చదవండి: పాక్ ఘన విజయం; లంక గడ్డపై అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా
Comments
Please login to add a commentAdd a comment