టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8 సమరానికి టీమిండియా సిద్ధమైంది. వెస్టిండీస్‌లోని బార్బడోస్ వేదికగా అఫ్గనిస్తాన్‌తో గురువారం తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
ఇందుకోసం రోహిత్ సేన ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. లీగ్ దశలో న్యూయార్క్ పిచ్‌పై పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడ్డ బ్యాటర్లు.. బ్రిడ్జ్‌టౌన్ పిచ్‌పై బ్యాట్ ఝులిపించాలని పట్టుదలగా ఉన్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తూ.. స్కిల్ సెషన్స్‌ను సద్వినియోగం చేసుకున్నారు టీమిండియా స్టార్లు. ఇక విండీస్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి.. టీమిండియా తుదిజట్టు ఎలా ఉండబోతున్నది ఆసక్తికరంగా మారింది.
అమెరికాలో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగిన రోహిత్ సేన.. వెస్టిండీస్‌లో ఓ పేసర్‌పై వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. ఓపెనింగ్ జోడీని మారిస్తే ఎలా ఉంటుందన్న అంశం మీద కూడా చర్చ జరుగుతోంది.
కోహ్లి విషయంలో ప్రయోగాలు వద్దు
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మకు జోడీగా విరాట్ కోహ్లి మాత్రమే ఉండాలని పేర్కొన్నాడు. కీలక మ్యాచ్‌లలో ఒత్తిడిని అధిగమించగల కోహ్లి.. అఫ్గన్‌తో పోరులోనూ ఓపెనర్‌గానే రావాలని ఆకాంక్షించాడు.
న్యూయార్క్‌లో పరిస్థితులు వేరని.. విండీస్ పిచ్‌లపై కోహ్లి కచ్చితంగా బ్యాట్‌తో మ్యాజిక్ చేస్తాడని ఇర్ఫాన్ పఠాన్ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లి ప్రత్యేకమైన నైపుణ్యాలున్న ఆటగాడని.. అతడి విషయంలో ప్రయోగాలు అనవసరం అని పఠాన్ అభిప్రాయపడ్డాడు.
అదే విధంగా.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్‌ను తప్పించి.. అతడి స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. పేస్ దళంలో నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్ ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.
అఫ్గనిస్తాన్‌తో సూపర్-8 మ్యాచ్‌కు ఇర్ఫాన్ పఠాన్ ఎంచుకున్న భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment