అబుదాబి: ఐపీఎల్‌లో ఈ సీజన్‌లోనూ దూసుకెళ్తామని, టైటిల్ నిలబెట్టుకుంటామని డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ సారి కూడా ఓపెనర్‌గానే బ్యాటింగ్‌కు దిగుతానని చెప్పాడు. ఇక్కడ ఆడటం తమ వాళ్లకు కొత్త కావడంతో పరిస్థితులకు అలవాటు పడటం సవాలుతో కూడుకున్నదని పేర్కొన్నాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై తలపడుతుంది. ఈ నేపథ్యంలో రోహిత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘గతేడాది మొత్తం నేను ఓపెనర్‌గా ఆడాను. ఇప్పుడూ అదే కొనసాగిస్తాను. ముంబైకే కాదు... టీమిండియాకు ఆడేటపుడు కూడా నేను జట్టు మేనేజ్‌మెంట్‌కు స్పష్టంగా చెబుతాను. జట్టు కోసం ఎక్కడైనా ఆడతాను. అయితే అసలు సమస్యే లేనప్పుడు దాని బాగు చేయాలని ప్రయత్నించడంలో అర్థం లేదు’ అని చెప్పాడు. ఇక్కడి పరిస్థితులతో పెను సవాళ్లు తప్పవని రోహిత్ అభిప్రాయపడ్డాడు.
‘ముఖ్యంగా పిచ్‌ను అర్థం చేసుకుంటేనే మానసికంగా సన్నద్ధం కాగలం. బ్యాటింగ్ అయినా... బౌలింగ్ అయినా... వికెట్ అర్థమైతే అందుకు తగ్గ ప్రణాళికతో అడుగు వేయొచ్చు. గతంలో ఇక్కడి ప్రదర్శనతో ఇప్పుడైతే ఓ అంచనాకు రాలేం’ అని రోహిత్ వివరించాడు. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 2014లో ఇక్కడ జరిగిన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ప్లే–ఆఫ్స్‌కు వెళ్లింది. ఆసియా కప్‌లో టీమిండియాకు ఎదురైన అనుభవాలు తనకు తెలుసని, ఆట మొదలైనప్పుడు ఉండే పిచ్ ముగిసే సమయానికి ఎలా మారుతుందో ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా అలాగే మారొచ్చని చెప్పాడు. కృనాల్ పాండ్యా, రాహుల్ చహర్, బల్వంత్‌రాయ్, అనుకూల్ రాయ్‌లతో కూడిన స్పిన్ విభాగంపై రోహిత్ ఆశలు పెట్టుకున్నాడు. వీళ్లందరికీ దేశవాళీ క్రికెట్‌లో మంచి అనుభవాన్ని గడించారని అది ఇక్కడ అక్కరకు వస్తుందని అన్నాడు.
తొలిమ్యాచ్ ప్రత్యర్థి చెన్నై సూపర్‌కింగ్స్‌పై మాట్లాడుతూ మేటి జట్ల మధ్య ఆసక్తికర సమరం జరుగుతుందన్నాడు. లంక స్పీడ్‌స్టర్, సీనియర్ బౌలర్ మలింగ లేకపోవడం తమకు లోటేనని హిట్‌మ్యాన్ చెప్పాడు. ముంబై విజయాల్లో అతని పాత్ర ఎంతో ఉందన్నాడు. మలింగ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమే అయినా ఇతర పేసర్లు ప్యాటిన్సన్, ధావల్ కులకర్ణి, మొహసిన్ ఖాన్‌లు సత్తా చాటుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. కోచ్ మహేలా జయవర్ధనే మాట్లాడుతూ... ‘గాయం నుంచి కోలుకొని సుదీర్ఘ కాలం తర్వాత బరిలోకి దిగుతున్న హార్దిక్ పాండ్యాపై అనవసర ఒత్తిడి పెంచబోం, విజయవంతమైన ఫినిషర్లుగా మారెందుకు చాలా మందికి ఇప్పుడు అవకాశాలున్నాయి. క్రిస్ లిన్ రూపంలో నాణ్యమైన డాషిం గ్ ఓపెనర్ ఉన్నప్పటికీ ఈ సారి కూడా రోహిత్–డికాక్ జోడీనే ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తుంది’ అని స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment