Asian Athletics Championships 2023: Parul Chaudhary wins gold in 3000m steeplechase, Shaili jumps for silver - Sakshi
Sakshi News home page

Asian Athletics Championship: పారుల్, తజిందర్‌లకు స్వర్ణ పతకాలు 

Published Sat, Jul 15 2023 8:47 AM | Last Updated on Sat, Jul 15 2023 11:25 AM

Parul Chaudhary wins gold in 3000m steeplechase-Shaili jumps For silver - Sakshi

బ్యాంకాక్‌: ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు భారత్‌కు మూడు పతకాలు లభించాయి.  ఇందులో రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం ఉన్నాయి. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌ ఈవెంట్‌లో పారుల్‌ చౌధరీ విజేతగా నిలిచి పసిడి పతకం సొంతం చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పారుల్‌ 9 నిమిషాల 38.76 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

సుధా సింగ్‌ (2013, 2017), లలితా బబర్‌ (2015) తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లో 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో స్వర్ణం నెగ్గిన మూడో భారతీయ అథ్లెట్‌గా పారుల్‌ నిలిచింది. మహిళల లాంగ్‌జంప్‌ ఈవెంట్‌లో ఉత్తరప్రదేశ్‌కే చెందిన 19 ఏళ్ల శైలీ సింగ్‌ రజత పతకం గెలిచింది. శైలీ  సింగ్‌ 6.54 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. 

పురుషుల షాట్‌పుట్‌ ఈవెంట్‌లో తజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌ తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. పంజాబ్‌కు చెందిన 28 ఏళ్ల తజిందర్‌పాల్‌ ఇనుప గుండును 20.23 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. బిలాల్‌ సాద్‌ ముబారక్‌ (ఖతర్‌), ఘరీబ్‌ అల్‌ జిన్‌కావి (కువైట్‌) తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండుసార్లు షాట్‌పుట్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకాలు నెగ్గిన మూడో అథ్లెట్‌గా తజిందర్‌పాల్‌ గుర్తింపు పొందాడు. మూడో రోజు పోటీల తర్వాత భారత్‌ ఐదు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో తొమ్మిది పతకాలతో మూడో స్థానంలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement