
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ ఓ విధ్వంసకర ఆటగాడిని జట్టులోకి చేర్చుకుంది. వ్యక్తిగత కారణాల చేత రాబోయే సీజన్‌కు దూరంగా ఉండనున్న ఇంగ్లండ్ ఆటగాడు జేసన్ రాయ్ స్థానాన్ని అదే దేశానికి చెందిన ఫిల్ సాల్ట్‌తో భర్తీ చేసింది. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సాల్ట్‌ను కేకేఆర్ మేనేజ్‌మెంట్ 1.5 కోట్ల రిజర్వ్ ధరకు సొంతం చేసుకుంది.
2024 సీజన్ వేలంలో సాల్ట్ అన్ సోల్డ్‌గా మిగిలిపోయాడు. రాబోయే సీజన్‌కు సంబంధించి కేకేఆర్‌లో ఇది రెండో మార్పు. ఇంగ్లండ్ బౌలర్ గస్ అట్కిన్సన్ జాతీయ జట్టుకు ఆడాల్సి ఉండటంతో అతను ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్నాడు. దీంతో అతని స్థానాన్ని శ్రీలంక పేసర్ దుష్మంత చమీరాతో భర్తీ చేసింది కేకేఆర్ మేనేజ్‌మెంట్.
కాగా, 27 ఏళ్ల ఫిల్ సాల్ట్‌కు విధ్వంసకర ఆటగాడిగా పేరుంది. ఇంగ్లండ్ తరఫున, లీగ్ క్రికెట్‌లో ఇతను మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. సాల్ట్‌కు ఐపీఎల్‌లోనూ ఓ మోస్తరు రికార్డు ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో అతను 9 మ్యాచ్‌లు ఆడి 2 అర్దశతకాలు చేశాడు. ఐపీఎల్‌లో సాల్ట్ స్ట్రయిక్ రేట్ 163.9గా ఉంది. ఇంగ్లండ్ తరఫున 19 వన్డేలు, 21 టీ20లు ఆడిన సాల్ట్.. 3 సెంచరీలు, 5 అర్దసెంచరీల సాయంతో 1258 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లోనూ సాల్ట్ స్ట్రయిక్‌రేట్ ప్రమాదకరంగా ఉంది.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌కు సంబంధించిన తొలి విడత షెడ్యూల్ ఇదివరకే విడుదలైంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. కేకేఆర్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. తొలి విడతలో కేకేఆర్ మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ తర్వాత కేకేఆర్.. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment