రంజీ ట్రోఫీ 2024లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా ఆటగాడు శివమ్ దూబే చెలరేగిపోయాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (86/6) దూబే మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. 130 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేసి ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు.
దూబేకు షమ్స్ ములానీ (63), మోహిత్ అవస్థి (49) సహకరించడంతో ముంబై సెకెండ్ ఇన్నింగ్స్‌లో 320 పరుగులు చేసి ఆలౌటైంది. అంతకుముందు దూబే బౌలింగ్‌లోనూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతను అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు వికెట్లతో చెలరేగాడు. ఇటీవల స్వదేశంలోనే ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించి, హార్దిక్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న దూబే మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడి టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. దూబే సెంచరీతో కదంతొక్కినప్పటికీ ముంబై మ్యాచ్ కాపాడుకునే పరిస్థితి కనపడటం లేదు. 195 పరుగుల లక్ష్య ఛేదనలో ఉత్తర్‌ప్రదేశ్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసి (నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి) లక్ష్యానికి 107 పరుగుల దూరంలో ఉంది. యూపీ ఇన్నింగ్స్‌లో సమర్థ్ సింగ్ (2), ప్రియం గార్గ్ (4) ఔట్ కాగా.. ఆర్యన్ జుయల్ (54), కరణ్ శర్మ (28) క్రీజ్‌లో ఉన్నారు. మోహిత్ అవస్థి, రాయ్‌స్టన్ డయాస్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై యూపీ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 198 పరుగులకే ఆలౌటైంది. అంకిత్ రాజ్‌పుత్, ఆకిబ్ ఖాన్ తలో 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, శివమ్ శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ముంబై ఫస్ట్ ఇన్నింగ్స్‌లో షమ్స్ ములానీ (57) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం యూపీ తొలి ఇన్నింగ్స్‌లో 324 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ నితీశ్ రాణా (106) సెంచరీతో కదంతొక్కగా.. ఓపెనర్ సమర్థ్ సింగ్ (63) అర్ధసెంచరీ సాధించాడు. ముంబై బౌలర్లలో శివమ్ దూబే, రాయ్‌స్టన్ డయాస్ చెరో 3 వికెట్లు, మోహిత్ అవస్థి, డిసౌజా, షమ్స్ ములానీ, తనుష్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment