
హర్యానాతో జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ (ఫిబ్రవరి 8-12) కోసం 18 మంది సభ్యుల ముంబై జట్టును ఇవాళ (ఫిబ్రవరి 3) ప్రకటించారు. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్ కోసం ముంబై సెలెక్టర్లు భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, టీమిండియా విధ్వంసకర బ్యాటర్ శివమ్ దూబేను ఎంపిక చేశారు.
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ పేర్లను ముంబై సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఈ ముగ్గురు భారత వన్డే జట్టులో సభ్యులుగా ఉన్నారు. ముంబై జట్టులో యువ బ్యాటర్లు ఆయుశ్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, సిద్దేశ్ లాడ్ చోటు దక్కించుకున్నారు. ముంబై బౌలింగ్ అటాక్‌ను శార్దూల్ ఠాకూర్ లీడ్ చేస్తాడు. బౌలింగ్ విభాగంలో మోహిత్ అవస్తి, శివమ్ దూబే, తనుశ్ కోటియన్, షమ్స్ ములానీ సభ్యులుగా ఉన్నారు. ఆకాశ్ ఆనంద్, హార్దిక్ తామోర్ వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు.
కాగా, ముంబై జట్టు గ్రూప్ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మేఘాలయాపై ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో ముంబై భారీ తేడాతో గెలుపొందడంతో బోనస్ పాయింట్ కూడా సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై కేవలం ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ 456 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయా 86 పరుగులకే కుప్పకూలింది. శార్దూల్ ఠాకూర్ హ్యాట్రిక్ సాధించాడు. మేఘాలయా ఇన్నింగ్స్‌లో మొదటి ఆరుగురు బ్యాటర్లలో ఐదుగురు డకౌట్లయ్యారు. అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 671 పరుగులు చేసింది. సిద్దేశ్ లాడ్ (145), ఆకాశ్ ఆనంద్ (103), షమ్స్ ములానీ (100 నాటౌట్) సెంచరీలు చేశారు. ఆజింక్య రహానే (96), శార్దూల్ ఠాకూర్ (84) సెంచరీలు మిస్ చేసుకున్నారు. అనంతరం మేఘాలయా రెండో ఇన్నింగ్స్‌లో 129 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ముంబై జట్టు అజింక్య రహానే (కెప్టెన్), ఆయుష్ మాత్రే, అంగ్క్రిష్ రఘువంశీ, అమోఘ్ భత్కల్, సూర్యకుమార్ యాదవ్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబే, ఆకాశ్ ఆనంద్ (వికెట్‌కీపర్), హార్దిక్ తమోర్ (వికెట్‌కీపర్), సూర్యాంశ్ షెడ్గే, శార్దూల్ ఠాకూర్, షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్, మోహిత్ అవస్తి, సిల్వెస్టర్ డిసౌజా, రాయ్‌స్టన్ డయాస్, అథర్వ అంకోలేకర్, హర్ష్ తన్నా