టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశలో తమకు ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సూపర్-8లో అడుగుపెట్టింది. ఆతిథ్య అమెరికా జట్టుపై బుధవారం నాటి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది తదుపరి దశకు అర్హత సాధించింది.
అయితే, పసికూనే అయినా అమెరికాపై రోహిత్ సేనకు ఈ విజయం అంత సులువుగా రాలేదు. 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలో తడబడిన భారత జట్టు సూర్యకుమార్ యాదవ్(50), శివం దూబే(31) అద్భుత అజేయ ఇన్నింగ్స్ కారణంగా గట్టెక్కింది.
బ్యాటింగ్ అనుకూలించని పిచ్‌పై వీరిద్దరు మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ సూర్య, దూబేలపై ప్రశంసలు కురిపించాడు.
గెలుపు అంత తేలికగా రాదని తెలుసు
అదే విధంగా.. అమెరికాపై విజయంలో బౌలర్ల పాత్ర కూడా ఎంతో కీలకమని పేర్కొన్నాడు. ‘‘ఈ మ్యాచ్‌లో గెలుపు అంత తేలికగా రాదని తెలుసు. మా వాళ్ల మెరుగైన భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైంది.
బౌలర్లు కూడా
సూర్య, దూబే ఆద్యంతం పట్టుదలగా నిలబడి పరిణతితో కూడిన ఇన్నింగ్స్ ఆడారు. అందుకు వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇక మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు.
ముఖ్యంగా అర్ష్‌దీప్. దూబే రూపంలో మాకు మరో ఆప్షన్ ఉంది కాబట్టి.. ఈ మ్యాచ్‌లో ప్రయత్నించి చూశాం. ఎందుకంటే ఈరోజు పిచ్ సీమర్లకు ఎక్కువగా అనుకూలించింది. కాబట్టి అతడి సేవలను వాడుకున్నాం.
అతిపెద్ద ఊరట
ఇక సూపర్-8కు క్వాలిఫై అవటం అనేది అతిపెద్ద ఊరట. ఇలాంటి పిచ్‌లపై విజయాలు అంత సులువేమీ కాదు. ప్రతి మ్యాచ్‌ను చాలెంజింగ్‌గా తీసుకున్నాం.
మూడింట మూడు విజయాలు సాధించాం. ఫలితంగా మా ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. సూర్యకుమార్ యాదవ్ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడి నుంచి మేము ఏం ఆశిస్తామో.. ఈరోజు అదే అతడు చేసి చూపించాడు.
కఠినమైన పిచ్‌పై తనదైన శైలిలో రాణించి విజయాన్ని అందించాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. సమిష్టి కృషితో సూపర్-8కు అర్హత సాధించడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు.
టీ20 ప్రపంచకప్-2024: ఇండియా వర్సెస్ యూఎస్‌ఏ స్కోర్లు
👉వేదిక: న్యూయార్క్
👉టాస్: ఇండియా బౌలింగ్
👉యూఎస్‌ఏ స్కోరు- 110/8 (20)
👉ఇండియా స్కోరు- 111/3 (18.2)
👉ఫలితం- ఏడు వికెట్ల తేడాతో యూఎస్‌ఏపై ఇండియా విజయం
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అర్ష్‌దీప్ సింగ్(4/9).
చదవండి: రూ. 250 కోట్లు.. బ్యాటర్లకు చుక్కలే! కూల్చేయనున్న ఐసీసీ?
Comments
Please login to add a commentAdd a comment