T20 world Cup 2022: వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. తనకు రోహిత్ ఆట తీరంటే ఎంతో ఇష్టమన్న ఆయన.. కెప్టెన్ కాకముందు నుంచే హిట్‌మ్యాన్‌కు తాను అభిమానినని చెప్పుకొచ్చాడు. కాగా విరాట్ కోహ్లి తర్వాత టీమిండియా పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.
అయితే, ఆసియా కప్-2022లో మాత్రం భారత జట్టు అంచనాల మేరకు రాణించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా టీ20 వరల్డ్‌కప్-2022 ట్రోఫీ కైవసం చేసుకొని కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్ గెలిచన ఘనత సాధించాలని రోహిత్ శర్మ పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు.. హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌ది కూడా ఇలాంటి పరిస్థితే!
ఈ క్రమంలో ఇప్పటికే ప్రపంచకప్ వేదిక ఆస్ట్రేలియాకు చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీసులో తలమునకలైపోయింది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ జర్నలిస్టు విమల్ కుమార్ ఇంటర్వ్యూలో సర్ వివియన్ రిచర్డ్స్ మాట్లాడుతూ రోహిత్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
రోహిత్ అంటే ఇష్టం..
‘‘నాకు రోహిత్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా విరాట్ కోహ్లి సారథ్యంలో ఆడిన సమయంలో అతడి ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. రోహిత్ కెప్టెన్ కాకముందు నుంచే నేను అతడికి వీరాభిమానిని’’ అని వివియన్ రిచర్డ్స్ పేర్కొన్నాడు.
అదే విధంగా సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి పట్ల అభిమానం చాటుకున్నాడు. ‘‘సచిన్, విరాట్ కోహ్లిలంటే నాకెంతో గౌరవం. వారికి కూడా నా పట్ల అభిమానం ఉంది. వాళ్లిద్దరు సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నిజం చెప్పాలంటే నేను సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లిల ఆటను ఎంతగానో ఆరాధిస్తాను. ఈరోజు భారత జట్టు ఈ స్థాయిలో ఉందంటే ఇలాంటి గొప్ప ఆటగాళ్ల వల్లే! ఇండియాలో ఎంతో మంది గొప్ప బ్యాటర్లు ఉన్నారు. వాళ్లందరి వల్లే ఇది సాధ్యమైంది’’ అని వివియన్ రిచర్డ్స్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment