కోహ్లిని ఓపెనర్‌గా పంపితే అంతే సంగతులు! | Virat Rohit T20 WC Opening Pair Talks Get No From Brian Lara | Sakshi
Sakshi News home page

కోహ్లిని ఓపెనర్‌గా పంపితే అంతే సంగతులు!

Published Mon, Apr 8 2024 6:14 PM | Last Updated on Mon, Apr 8 2024 7:10 PM

Virat Rohit T20 WC Opening Pair Talks Get No From Brian Lara - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2024 నేపథ్యంలో టీమిండియా ఓపెనింగ్‌ జోడీ గురించి వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ శర్మతో పాటు యువ బ్యాటర్‌ను పంపితేనే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

అలా కాదని విరాట్‌ కోహ్లిని గనుక ఓపెనర్‌గా ప్రమోట్‌ చేస్తే టీమిండియాకు కష్టాలు తప్పవని హెచ్చరించాడు. కాగా ఐపీఎల్‌-2024లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్‌ కోహ్లి ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 316 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 113 నాటౌట్‌. ఈ క్రమంలో పరుగుల వీరుడిగా ఆరెంజ్‌ క్యాప్‌ సైతం ప్రస్తుతానికి సొంతం చేసుకున్నాడు.

మరోవైపు.. ముంబై ఇండియన్స్‌ స్టార్‌, టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఇషాన్‌ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభిస్తున్నాడు. నాలుగు మ్యాచ్‌లలో కలిపి 118 పరుగులు మాత్రమే చేశాడు.

ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2022 తర్వాత రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి భారత టీ20 జట్టుకు దూరం కాగా.. యువ ఆటగాళ్లు వరుసగా అవకాశాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, రోహిత్‌ ,కోహ్లి ఇటీవలే రీఎంట్రీ ఇవ్వగా అంతగా ప్రభావం చూపలేకపోయారు.

ఐపీఎల్‌లో మాత్రం అదరగొడుతూ
ఇక ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్‌- అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్‌-2024 జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తరుణంలో కోహ్లికి భారత జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. యువ ఆటగాళ్లకు చోటిచ్చే క్రమంలో కోహ్లికి ఛాన్స్‌ రాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం కాగా.. బ్యాట్‌తోనే విమర్శకులకు సమాధానమిస్తున్నాడు కోహ్లి.

మరోవైపు.. ఈసారి కూడా రోహిత్‌ శర్మనే ఈ వరల్డ్‌కప్‌లో భారత జట్టును ముందుకు నడిపిస్తాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బ్రియన్‌ లారా స్టార్‌ స్పోర్ట్స్ షోలో ‘విరాహిత్‌’ ద్వయం గురించి తన ఆలోచనలు పంచుకున్నాడు.

‘‘ఈసారి వెస్టిండీస్‌కు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ఓపెనర్లుగా వెళ్తారేమో అనిపిస్తోంది. జట్టును ఎంపిక చేసేటపుడు బ్యాటింగ్‌ ఆర్డర్‌ విషయంలో కచ్చితంగా ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తారు.

అయితే, ప్రతి ఒక్కరికి తమదైన స్థానంలో రాణించే సత్తా ఉంటుంది. దాని ఆధారంగానే జట్టు కూర్పు ఉండాలి. ఒకవేళ  పవర్‌ ప్లేలో 70-80 పరుగులు కావాలనుకుంటే దూకుడుగా ఆడే వాళ్లు ఉండాలి.

నా దృష్టిలో రోహిత్‌, విరాట్‌.. ఇద్దరూ గొప్ప ప్లేయర్లే. అయినా.. వీరిలో ఒక్కరినే ఓపెనర్‌గా పంపాలి. అంటే రోహిత్‌ ఎప్పటి నుంచే ఈ పని చేస్తున్నాడు. కాబట్టి తనకి జోడీగా యువ ఆటగాడినే పంపాలి.

ఎందుకంటే ఒకవేళ కోహ్లిని గనుక ఓపెనర్‌గా పంపితే.. ఆరంభంలోనే వీరిద్దరు అవుటైతే మిడిలార్డర్‌లో ఉన్న వాళ్లపైనే భారం పడుతుంది. అది ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కాబట్టి కోహ్లిని ఓపెనర్‌గా పంపాలనే ఆలోచన పక్కనపెట్టి మూడో స్థానంలో పంపితేనే బాగుంటుంది’’అని బ్రియన్‌ లారా చెప్పుకొచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement