WC 2023: టీమిండియాకు షాక్‌! బీసీసీఐ కీలక ప్రకటన.. వైస్‌ కెప్టెన్‌ అవుట్‌.. ఇక | WC 2023 IND Vs NZ: BCCI Announces Injured Hardik Pandya Ruled Out Of NZ Match, Check Update On Return - Sakshi
Sakshi News home page

BCCI-Hardik Pandya Ruled Out: టీమిండియాకు షాక్‌! బీసీసీఐ కీలక ప్రకటన.. పాండ్యా అవుట్‌.. ఇక

Published Fri, Oct 20 2023 1:50 PM | Last Updated on Fri, Oct 20 2023 3:05 PM

WC 2023 BCCI Announces Injured Hardik Pandya Ruled Out Of NZ Match But - Sakshi

BCCI Medical Update On Hardik Pandya- ICC ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు షాక్‌ తగిలింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా జట్టుకు దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో అతడికి పరీక్షలు నిర్వహించారు.

పాండ్యాకు విశ్రాంతి అవసరం
ఈ క్రమంలో స్కానింగ్‌ రిపోర్టులు పరిశీలించిన అనంతరం హార్దిక్‌ పాండ్యాకు కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో టీమిండియా మ్యాచ్‌కు ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం కానున్నాడు.

ఈ మేరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. వైద్యుల సూచన మేరకు హార్దిక్‌ పాండ్యా రెస్ట్‌ తీసుకోనున్నాడని.. జట్టుతో కలిసి అతడు ధర్మశాలకు పయనం కావడం లేదని తెలిపింది.

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు పాండ్యా దూరం: బీసీసీఐ
అదే విధంగా.. కివీస్‌తో మ్యాచ్‌కు దూరమైనప్పటికీ.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇంగ్లండ్‌(అక్టోబరు 29)తో మ్యాచ్‌ కోసం పాండ్యా నేరుగా లక్నోకు చేరుకుని జట్టుతో కలుస్తున్నాడని బీసీసీఐ వెల్లడించింది.

కాగా పుణెలో గురువారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా హార్దిక్‌ పాండ్యా గాయపడ్డాడు. మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో పాండ్యా బౌలింగ్‌కు వచ్చాడు.

బంతిని ఆపబోయి కిందపడ్డ పాండ్యా
ఈ క్రమంలో పాండ్యా వేసిన మొదటి రెండు బంతుల్లో బంగ్లా ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ వరుసగా 0,4 పరుగులు రాబట్టగా.. మూడో బంతిని సైతం బౌండరీకి తరలించేందుకు స్ట్రెయిట్‌ డ్రైవ్‌ ఆడాడు. ఈ బంతిని ఆపేందుకు తన కుడికాలిని అడ్డుపెట్టిన పాండ్యా.. పట్టుతప్పి తన ఎడమకాలిపై పడిపోయాడు. 

ఆరేళ్ల తర్వాత తొలిసారి బౌలింగ్‌ చేసిన కోహ్లి
ఈ నేపథ్యంలో మడిమకు దెబ్బ బలంగా తాకడంతో పాండ్యా నొప్పితో విలవిల్లాడిపోయాడు. దీంతో అతడిని స్కానింగ్‌ కోసం పంపించగా.. గాయం తీవ్రంగానే ఉన్నట్లు తేలింది. ఈ నేప్యథంలో పాండ్యా మళ్లీ మైదానంలోకి రాలేదు. ఇక అసంపూర్తిగా పాండ్యా వదిలేసిన ఓవర్‌ను విరాట్‌ కోహ్లి పూర్తి చేశాడు. 

టీమిండియా- కివీస్‌ 4/4.. ఇక హోరాహోరీ
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో కోహ్లి అద్భుత అజేయ సెంచరీ(103)తో టీమిండియా బంగ్లా మీద ఘన విజయం సాధించింది. వరుసగా నాలుగో గెలుపు అందుకుంది. ఇక తదుపరి మ్యాచ్‌లో ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో టీమిండియా అక్టోబరు 22(ఆదివారం)న తలపడనుంది.

కాగా న్యూజిలాండ్‌ సైతం వరల్డ్‌కప్‌ తాజా ఎడిషన్‌లో ఓటమన్నదే ఎరుగక వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా- కివీస్‌ మధ్య పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం ఆదివారం హోరాహోరీ ఖాయమనిపిస్తోంది.

చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement