‘‘ముందుగా ఆస్ట్రేలియాకు కంగ్రాట్యులేషన్స్!! డబ్ల్యూటీసీ ఫైనల్ అద్భుతంగా సాగింది. విజయానికి వాళ్లు పూర్తిగా అర్హులు. మార్నస్ లబుషేన్ వంటి ఆటగాళ్లు కౌంటీల్లో ఆడటం వాళ్లకు కాస్త ప్రయోజనకరంగా మారిన మాట వాస్తవమే.
నిజానికి టీమిండియాలాగే ఆసీస్ కూడా గత డబ్ల్యూటీసీ సైకిల్‌లో నిలకడైన ప్రదర్శన కనబరిచింది. కానీ ఫైనల్‌కు చేరలేకపోయింది. కానీ ఈసారి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంది. వారికి గెలిచే అర్హత వందకు వందశాతం ఉంది’’ అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు.
అశూకు మొండిచేయి
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో రోహిత్ సేనను ఓడించిన ఆసీస్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ తన యూట్యూబ్ చానెల్‌లో ఓ వీడియో విడుదల చేశాడు. కాగా డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన టీమిండియా బౌలర్ అశూకు ఫైనల్ ఆడే జట్టులో చోటు దక్కలేదు.
అనుభవజ్ఞుడు, విదేశాల్లో మంచి రికార్డు ఉన్న అశ్విన్‌కు ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో మొండిచేయి చూపడం చర్చనీయాంశమైంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
ఈ విషయంపై తాజాగా స్పందించిన అశ్విన్.. ‘‘గత పదేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. కాబట్టి అభిమానులు ఆవేశపడటం సహజమే. వారి బాధను నేను సహానుభూతి చెందగలను.
నేనూ ధోని కెప్టెన్సీలో ఆడినవాడినే
అయితే, జట్టు నుంచి ఈ ఆటగాడిని తప్పిస్తే బాగుండు.. అతడికి అవకాశం ఇవ్వాల్సింది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సరికాదు. ఎందుకంటే రాత్రికి రాత్రే ఆటగాళ్ల నైపుణ్యాలు, శక్తిసామర్థ్యాల్లో మార్పులు రావు.
మనలో చాలా మంది ధోని నాయకత్వ పటిమ గురించి చర్చించుకుంటాం. అతడి సీక్రెట్ ఏంటి? ఏ విషయాన్నైనా అతడు సరళతరం చేస్తాడు. నేను కూడా ధోని సారథ్యంలో ఆడిన వాడినే.
అతడు తన జట్టులో తొలుత 15 మందిని ఎంపిక చేసుకుంటాడు. ఆ పదిహేను మంది నుంచే తుదిజట్టును ఎంపిక చేసుకుంటాడు. వారినే ఏడాది మొత్తం జట్టులో ఉండేలా చూసుకుంటాడు.
ఆటగాడికి సెక్యూరిటీ ఉండాలి
నిజానికి ఓ ఆటగాడు మెరుగైన ప్రదర్శన ఇవ్వాలంటే.. జట్టులో తన స్థానం పదిలమే అన్న నమ్మకం అతడికి కలగాలి’’ అని అన్నాడు. ధోని కెప్టెన్సీని ప్రశంసిస్తూ.. పరోక్షంగా రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌కు చురకలు అంటించాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అశూకు బదులు మరో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటిచ్చారు. అతడు ఈ మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
చదవండి: 'మెక్‌కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా'
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి భారత జట్టులోకి ధోని!
Comments
Please login to add a commentAdd a comment