ఐపీఎల్‌లో ఆ జట్టుకు కెప్టెన్‌గా సూర్య?.. స్పందించిన ‘స్కై’ | When I Was Playing Under Rohit: Suryakumar Yadav On Becoming Captain In IPL | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో ఆ జట్టుకు కెప్టెన్‌గా సూర్య?.. స్పందించిన ‘స్కై’

Published Sun, Oct 6 2024 10:47 AM | Last Updated on Sun, Oct 6 2024 11:59 AM

When I Was Playing Under Rohit: Suryakumar Yadav On Becoming Captain In IPL

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విజయాలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఆదివారం(అక్టోబరు 6) గ్వాలియర్‌ వేదికగా తొలి టీ20కి షెడ్యూల్‌ ఖరారైంది.

అది సానుకూలాంశమే
ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ శనివారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. జట్టులో కనీసం రెండు ఓవర్లు బౌలింగ్‌ చేయగల బ్యాటర్లు ఉండటం సానుకూలాంశమని తెలిపాడు. 

శ్రీలంక పర్యటనలోనూ ఈ తరహా ప్రయోగం చేశామని.. ఆటగాళ్లలో ఉన్న భిన్న నైపుణ్యాలను ఉపయోగించుకోవడంలో తప్పులేదన్నాడు. అందుకే బ్యాటర్ల చేతికీ బంతిని ఇచ్చేందుకు వెనుకాడమని తెలిపాడు.

రోహిత్‌ భాయ్‌ కెప్టెన్సీలో ఆడుతున్నపుడు కూడా
ఈ క్రమంలో సూర్యకుమార్‌ ఐపీఎల్‌ భవితవ్యం, ఫ్రాంఛైజీ క్రికెట్‌ కెప్టెన్సీ గురించి విలేఖరులు ప్రశ్నించారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘మీరు నన్ను ఇరుకున పెట్టేశారు(నవ్వుతూ). ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా ఉండటాన్ని ఆస్వాదిస్తున్నా. ముంబై ఇండియన్స్‌లో రోహిత్‌ భాయ్‌ కెప్టెన్సీలో ఆడుతున్నపుడు కూడా.. అవసరమైనపుడు సలహాలు ఇచ్చేవాడిని. 

మీకే తెలుస్తుంది
ఇక టీమిండియా విషయానికొస్తే.. ఇటీవల శ్రీలంకతో పాటు.. గతంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో సిరీస్‌లలోనూ నేను కెప్టెన్‌గా వ్యవహరించాను. జట్టును ఎలా ముందుకు నడిపించాలో ఇతర కెప్టెన్లను చూసి నేర్చుకోవడానికి సందేహించను.

జీవితం ఇలా ముందుకు సాగుతోంది. కాలం గడుస్తున్న కొద్దీ ఏం జరుగబోతుందో మీకే తెలుస్తుంది’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ తన ఐపీఎల్‌ కెప్టెన్సీ అంశంపై సంకేతాలు ఇచ్చాడు. కాగా సుదీర్ఘకాలంగా సూర్య ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు.

పాండ్యా సారథ్యంలో ముంబైకి ఘోర పరాభవం
కాగా ముంబై ఫ్రాంఛైజీ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి.. గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ట్రేడ్‌ చేసుకున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అయితే, పాండ్యా సారథ్యంలో ముంబై ఘోర పరాభవం చవిచూసింది. 

ముంబై ఇండియన్స్‌ సారథిగా సూర్య?
ఈ ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడగున పదో స్థానంలో నిలిచింది. ఇక ఇదే జట్టులో ఉన్న సూర్య గతంలో అతడి గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతేకాదు.. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యాను రీప్లేస్‌ చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్‌ జట్టులోనూ ఇదే తరహా మార్పు జరుగనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సూర్య వ్యాఖ్యలు కూడా వాటికి కాస్త ఊతమిచ్చేలాగానే ఉన్నాయి.

చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్‌ కుమారుడు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement