ఎండల తీవ్రతతో అప్రమత్తంగా ఉండాలి | Sakshi
Sakshi News home page

ఎండల తీవ్రతతో అప్రమత్తంగా ఉండాలి

Published Tue, May 7 2024 5:10 AM

ఎండల తీవ్రతతో  అప్రమత్తంగా ఉండాలి

మనుబోలు: ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్‌ఓ పెంచలయ్య కోరారు. మనుబోలులోని పీహెచ్‌సీని సోమవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఓఆర్‌ఎస్‌, గ్లూకోజ్‌ ద్రావణాలను తరచూ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రులను కేంద్ర బృందం త్వరలో తనిఖీ చేయనుందని, ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 104, ఫ్యామిలీ డాక్టర్‌ వైద్యసేవల్లో భాగంగా ఏయే గ్రామాలకెళ్లారనే వివరాలను సక్రమంగా నమోదు చేయాలని కోరారు. వైద్యాధికారులు మొహిసీనా సుల్తానా, గేయపూజిత, సీహెచ్‌ఓ రాజయ్య, స్టాఫ్‌ నర్సులు సుజాత, ఆదిలక్ష్మి, అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు.

గాలివాన బీభత్సం

కూలిన చెట్లు.. ఎగిరిపోయిన రేకులు

వరికుంటపాడు / ఉదయగిరి: నియోజకవర్గంలోని ఉదయగిరి, వరికుంటపాడు మండలాల్లో గల పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం సోమవారం కురిసింది. భానుడి ప్రతాపం, ఉక్కపొతతో అల్లాడిన ప్రజలు సాయంత్రం కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. ఈదురుగాలులకు మండలంలోని కొత్తపల్లిలో ఓ చెట్టు కొమ్మలు నేలకొరిగాయి. ఇంటి పైకప్పు రేకులు గాలులకు ఎగిరిపోయాయి. ఉదయగిరి మండలంలోని దేకూరుపల్లిలో వెంకట్రామయ్యకు చెందిన పశువుల కొట్టం రేకులు ఎగిరిపోయాయి. పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

గంజాయి రవాణా కేసులో వ్యక్తికి మూడేళ్ల జైలు

నెల్లూరు(లీగల్‌): గంజాయి రవాణా చేస్తున్నారని నమోదైన కేసులో ఒడిశాకు చెందిన జయదాస్‌దీప్‌ అనే వ్యక్తికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.పది వేల జరిమానాను విధిస్తూ నెల్లూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి కపర్ది సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. గతేడాది జూలై 12న గూడూరు సమీపంలో బ్యాగ్‌తో అనుమానాస్పదంగా తిరుగుతున్న జయదాస్‌దీప్‌ను పోలీసులు తనిఖీ చేసి రెండు కిలోల గంజాయిని రవాణా చేస్తున్నారని గుర్తించారు. గూడూరు దివిపాళెం వీఆర్వో ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైమేరకు తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దాట్ల రమణారెడ్డి కేసు వాదించారు.

Advertisement
 
Advertisement