సర్వేపల్లి ఉద్దండ నేతల బరి | Sakshi
Sakshi News home page

సర్వేపల్లి ఉద్దండ నేతల బరి

Published Wed, May 8 2024 2:50 AM

సర్వేపల్లి ఉద్దండ నేతల బరి

చిన్న గ్రామం పేరుతో

నియోజకవర్గం ఏర్పాటు

2009లో మారిన నియోజకవర్గ

స్వరూపం

పొదలకూరు : జిల్లా రాజకీయ చిత్రపటంలో సర్వేపల్లి నియోకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. 1955లో సర్వేపల్లి నియోజకవర్గం ఏర్పడింది. అప్పట్లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి అనే గ్రామాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఎంపిక చేశారు. ఇప్పటికీ 5 వేల మంది జనాభా కలిగిన మైనర్‌ పంచాయతీ నియోజకవర్గ కేంద్రంగా విరాజిల్లుతోంది. నియోజకవర్గంలో పొదలకూరు, ముత్తుకూరు, తోటపల్లిగూడూ రు, వెంకటాచలం, మనుబోలు మండలాలు ఉన్నాయి. 2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఈ నియోజకవర్గంలో మనుబోలు, పొదలకూరు మండలాలు లేవు.

ఎమ్మెల్యేగా ఉద్దండులు పోటీ

1955లో నియోజకవర్గం ఆవిర్భవించింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో డాక్టర్‌ బెజవాడ గోపాల్‌రెడ్డి ఆత్మకూరు, సర్వేపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం సర్వేపల్లి స్థానానికి గోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ క్రమంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నేత సోమిరెడ్డి పెదనాన్న సోమిరెడ్డి ఆదినారాయణరెడ్డి, టీపీ గూడూరుకు చెందిన వంగల్లు కోదండరామిరెడ్డి పోటీ పడ్డారు. 7 వేల ఓట్ల మెజారిటీతో కోదండరామిరెడ్డి విజయం సాధించారు.

● 1962 ఎన్నికల్లో టీపీగూడూరు మండలం పాపిరెడ్డిపాళేంకు చెందిన వేమారెడ్డి వెంకురెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోదండరామిరెడ్డిపై 86 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

● 1967లో సర్వేపల్లి ఎస్సీలకు రిజర్వ్‌ అయ్యింది. ఇందుకూరుపేట మండలం పల్లెపాడుకు చెందిన స్వర్ణ వేమయ్య ఇండిపెండెంట్‌ అభ్యర్థి జోగి శంకరరావుపై 266 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

● 1972 ఎన్నికల్లో అల్లూరు మండలం ఇస్కపల్లికు చెందిన మంగళగిరి నానాదాసు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. 23 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో స్వర్ణ వేమయ్యపై గెలుపొందారు.

● 1978లో సామాన్య రైతు కుటుంబం నుంచి చిత్తూరు వెంకట శేషారెడ్డి (సీవీ శేషారెడ్డి) బరిలోకి దిగారు. మడమనూరు, పంటపాళేం సర్పంచ్‌గా పని చేశారు. ఆయన ఇందిరా కాంగ్రెస్‌ అభ్యర్థిగా తన రాజకీయ గురువు ఆనం భక్తవత్సలరెడ్డి, ఉద్దండుడైన గునపాటి రామచంద్రారెడ్డితో తలపడ్డారు. 21,962 ఓట్ల మెజారిటీతో శేషారెడ్డి విజయం సాధించారు.

● 1983లో ఎన్టీఆర్‌ ప్రభంజనంలో టీపీ గూడూరు మండలం రావూరువారి కండ్రికకు చెందిన న్యాయవాది చెన్నారెడ్డి పెంచలరెడ్డి టీడీపీ అభ్యర్థిగా 15,277 ఓట్ల మెజారిటీతో సీవీ శేషారెడ్డిపై విజయం సాధించారు.

● 1985లో జరిగిన ఎన్నికల్లో ముత్తుకూరుకు చెందిన వ్యవసాయ పట్టభద్రుడు ఈదూరు రామకష్ణారెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కోటారెడ్డి విజయకుమార్‌రెడ్డిపై 21,566 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

● 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన సీవీ శేషారెడ్డి టీడీపీ అభ్యర్థి పూండ్ల దశరథరామిరెడ్డిపై 13,148 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

● 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సీవీ శేషారెడ్డిపై సోమిరెడ్డి 33,775 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

● 1999 ఎన్నికల్లో కూడా సోమిరెడ్డి రెండో పర్యాయం శేషారెడ్డిపై పోటీ చేసి 16,902 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

● 2004లో ఆదాల ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగి సోమిరెడ్డి దూకుడు కు కళ్లెం వేశారు. 2004 ఎన్నికల్లో సోమిరెడ్డిపై 7,599 ఓట్ల మెజారిటీతో విజయం సాధించా రు. 2009 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి సోమి రెడ్డిపై వరుసగా రెండో పర్యాయం 10,256 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

● 2014 ఎన్నికల బరిలో నెల్లూరు జెడ్పీచైర్మన్‌గా పని చేసిన సొంత నియోజకవర్గానికి చెందిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డిపై 5,451 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వరుసగా రెండో పర్యాయం కాకాణి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డిపై 14 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు.

– రాజకీయ చిత్రపటంలో ప్రత్యేక స్థానం

పాతకాపుల మధ్యే పోటీ

సర్వేపల్లిలో పాతకాపుల మధ్యే పోటీ నెలకొంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సర్వేపల్లి బరిలో ఉన్నారు. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనేందుకు సిద్ధంగా ఉన్నారు. సోమిరెడ్డి వరుసగా సర్వేపల్లి నుంచి నాలుగు పర్యాయాలు ఓటమి చెందడం, రాజకీయ చతురత ప్రదర్శించడంలో వెనకబడడం ఆయన గెలుపునకు పెద్ద ఆటంకంగా ఏర్పడింది. కాకాణి వరుసగా రెండు పర్యాయాలు గెలుపొందడం, రాజకీయ చాణక్యుడిగా పేరు ఉండడంతో పాటు సర్వేపల్లిని ఊహించని విధంగా అభివృద్ధి చేసి గెలుపు దిశగా దూసుకుపోతున్నారు.

 
Advertisement
 
Advertisement