● మహిళపై బూతులతో రెచ్చిపోయిన వైనం
● సోషల్ మీడియాలో ఆడియో వైరల్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తాను చేసే బియ్యం వ్యాపారంలో కలుగజేసుకుంటున్నదని ఓ మహిళపై కందుకూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు తీవ్రస్థాయిలో రెచ్చిపోయాడు. పత్రికల్లో రాయలేని భాషలో బూతులు తిడుతూ, కనిపిస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుడ్లూరు మండలానికి చెందిన ఓ మహిళ కందుకూరులో నివాసం ఉంటోంది. ఆమె కొన్నేళ్లుగా బియ్యం వ్యాపారం చేసుకుంటూ తన ఇద్దరు కుమారులను చదివించుకుంటోంది. టీడీపీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత బియ్యం వ్యాపారం మొత్తం ఆ పార్టీ నాయకుల గుత్తాధిపత్యం కిందకు వెళ్లింది. బియ్యం వ్యాపారానికి బాస్‌గా ఉన్న మల్లేశ్వరరావు పట్టణంలో ఒక్క బియ్యపు గింజ కూడా వేరే వాళ్లకి వెళ్లడానికి లేదని డీలర్లపైన ఆంక్షలు పెట్టాడు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం ఆమె పట్టణంలోని ఓ డీలర్ వద్ద బియ్యం కొనుగోలు చేసి తరలించేందుకు ఆటోను ఏర్పాటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మల్లేశ్వరరావు నా సామ్రాజ్యంలో బియ్యం కొనడానికి ఎవరంటూ బూతులతో రెచ్చిపోయాడు. రాయడానికి వీలులేని బూతు పదాలతో మండిపడ్డాడు. అంతటితో ఆగకుండా ఇంకోసారి టౌన్లో ఎక్కడా బియ్యం కొన్నట్లు తెలిసినా, మీ ఆటో వచ్చినా పెట్రోల్ పోసి తగలబెడతానంటూ తీవ్ర బెదిరింపులకు దిగాడు.
Comments
Please login to add a commentAdd a comment