జీజీహెచ్‌లో కుర్చీల కోసం వార్
నెల్లూరు(అర్బన్): నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కుర్చీల విషయమై వైద్యుల మధ్య వివాదం నెలకొంది. తాను వినియోగిస్తున్న ఒక కుర్చీని తీసేశారంటూ ఈఎన్టీ డాక్టర్ ఇన్‌చార్జి హెచ్‌ఓడీకి వ్యతిరేకంగా మంగళవారం నిరసన తెలిపారు. ఇందులో భాగంగా నేలపై కూర్చొని వైద్యసేవలందించారు. ఇద్దరు డాక్టర్ల మధ్య నడుస్తున్న వివాదం వల్ల రోగులకు వైద్యసేవలు ఆలస్యమయ్యాయి. ఈ సందర్భంగా నిరసన తెలుపుతున్న చెవి, ముక్కు, గొంతు డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ తనను హెచ్‌ఓడీ శ్రీదేవి వేధిస్తున్నట్లు ఆరోపించారు. ఆమె సక్రమంగా విధులకు రావడం లేదన్నారు. తాను పేదలకు అరుదైన ఆపరేషన్లు చేయడంతో ఈ విషయం పత్రికల్లో ప్రచురితమైనట్లు చెప్పారు. అప్పటి నుంచి ఆమె అసూయ పెంచుకున్నారని వెల్లడించారు. అడ్మిట్ చేసిన కేస్ షీట్‌లో సైతం తన పేరు కొట్టేసి ఆమె పేరు రాసుకున్నట్లు చెప్పారు. యూనిట్ విధానాన్ని మార్చేయడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ మీద బాధ్యతలు తోసేసి ఆమె విధులకు సక్రమంగా రావడం లేదని, 12 గంటల తర్వాత ఓపీలో ఉండటం లేదని ఆరోపించారు. ఈ విషయాలను సూపరింటెండెంట్‌కు చెప్పినా స్పందించలేదన్నారు. తాను ఒకటిన్నర సంవత్సరంగా వాడుతున్న రివాల్వింగ్ కుర్చీని ఇప్పుడు ఆమె లాక్కొనడంతో నిరసన తెలుపుతున్నానన్నారు.
నేను విధులకు వస్తున్నా..
ఈ విషయమై డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ ఆ కుర్చీ ఆ డాక్టర్ మాత్రమే వాడాలని లేదు కదా అన్నారు. తాను హెచ్‌ఓడీ కాబట్టి తీసుకున్నానన్నారు. ఆయనకు ఎస్ టైపు కుర్చీ ఉందని తెలిపారు. తాను విధులకు సక్రమంగానే వస్తున్నానన్నారు. వైద్య విద్యార్థులకు యూజీ క్లాసులను చెప్పేందుకు ఒక గంట మాత్రమే ఓపీలో ఉండటం లేదని వెల్లడించారు. డాక్టర్ సుకుమార్ తనపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. నిరసన విషయం తెలుసుకున్న ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ కాలేషాబాషా, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మస్తాన్‌బాషా, పీజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నరేంద్ర, అడ్మిన్ అధికారులు డాక్టర్ కళారాణి, డాక్టర్ సుశీల్ తదితరులు సుకుమార్ వద్దకు వచ్చి మాట్లాడారు. నిరసన విరమించాలని సూచించారు. తాను చెప్పిన వాటికి ఆ డాక్టరమ్మ చేత వివరణ రాయించుకోవాలని అప్పుడే నిరసన విరమించుకుంటానని అతను భీష్మించుకున్నాడు. దీంతో మధ్యాహ్నం వరకు అలాగే నిరసన కొనసాగింది.
తన కుర్చీ తీసేశారంటూ ఓ డాక్టర్ నిరసన
ఇన్‌చార్జి హెచ్‌ఓడీపై ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment