15 మంది అధికారులకు మెమోలు ●
● జారీచేసిన జేసీ కార్తీక్
● విధుల్లో నిర్లక్ష్యంపై చర్యలు
నెల్లూరు(అర్బన్): ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సకాలంలో హాజరుకాని 15 మంది జిల్లా అధికారులకు జాయింట్ కలెక్టర్ కార్తీక్ మెమోలు జారీ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జేసీ హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా 10.30 గంటలు దాటినప్పటికీ పలువురు అధికారులు హాజరు కాలేదు. కొంతమంది చాలా ఆలస్యంగా వచ్చారు. దీంతో విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన జేసీ మెమోలు జారీ చేశారు.
ఇదే సందర్భంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన అర్జీలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇకపై మండల, మున్సిపల్ కేంద్రాలలో సైతం ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు దగ్గరలోని మండల కార్యాలయాల్లో అర్జీలు ఇవ్వవచ్చన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 195 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ ఉదయభాస్కర్, జెడ్పీ ఇన్‌చార్జి సీఈఓ మోహన్‌రావు, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, డ్వామా పీడీ గంగా భవానీ, డీటీసీ చందర్, ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ పెంచలయ్య, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రమేష్‌నాథ్, సర్వజన ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారి డాక్టర్ సుశీల్ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ సీఈఓగా విద్యారమ
నెల్లూరు (పొగతోట): శ్రీకాళహస్తి ఈటీసీలో విధులు నిర్వహిస్తున్న ఎం.విద్యారమను నెల్లూరు జిల్లా పరిషత్ సీఈఓగా నియమిస్తూ పంచాయతీ రాజ్ శాఖాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరులో జెడ్పీ సీఈఓగా ఒక్క రోజు పనిచేసి సెలవుపై వెళ్లిన ఖాదర్‌బాషాను నగరి డీఎల్‌డీఓగా బదిలీ చేశారు. డ్వామా పీడీగా పనిచేస్తూ పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పి.వెంకట్రావ్‌ను బాపట్ల ఈటీసీ ప్రిన్సిపల్‌గా నియమించారు.
సివిల్స్ పరీక్షలకు
ఉచిత శిక్షణ
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): యుపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో విజయవాడలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈనెల 24వ తేదీలోపు తమ దరఖాస్తులను జిల్లా బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందచేయాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 27న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు నేరుగా గానీ, లేదా 93815 54779, 93902 39588 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు.
ఉపాధ్యాయుడి దాడి
ఘటనపై విచారణ
కలిగిరి: కలిగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని కొట్టి, టీసీ ఇవ్వడానికి కారణమైన తెలుగు ఉపాధ్యాయుడు మన్నం శ్రీనివాసులు తీరుపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో కావలి డిప్యూటీ డీఈఓ రఘురామయ్య సోమవారం విచారణ చేపట్టారు. ఉపాధ్యాయులు, విద్యార్ధుల తల్లిదండ్రులతో వేరువేరుగా విచారణ జరిపారు. టీసీ జారీ చేసిన విద్యార్ధి చేవూరి అభిషేక్‌ను తిరిగి పాఠశాలలో కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. డిప్యూటీ డీఈఓ రాఘురామయ్య మాట్లాడుతూ విద్యార్థికి టీసీ ఇవ్వడం ఉపాధ్యాయులు చేసిన మంచి నిర్ణయం కాదు. ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు, ఇతరులు లిఖిత పూర్వకంగా ఇచ్చిన వివరాలతో పాటు తన విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment