టీడీపీ నాయకుడి భూ ఆక్రమణ
ఆత్మకూరు: ఆయన ఓ మాజీ ఎమ్మెల్యే సోదరుడు. తాను చెప్పినట్లే జరగాలని గతంలో అధికారులను శాసించేవాడు. పలువురు వీఆర్‌ఓలను, అధికారులను లోబరుచుకొని రికార్డులు తారుమారు చేసి దళితుల భూములు ఆక్రమించుకున్నాడు. ఓ కుటుంబం భూముల ఆక్రమణపై హైకోర్టులో పిటిషన్ వేయగా ఆ భూముల్లో ఎవరూ దిగరాదని ‘స్టేటస్‌కో’ ఇచ్చింది. దానిని బేఖాతరు చేస్తూ రెండు రోజులుగా ఆ భూమిలో ట్రాక్టర్‌తో దున్నిస్తున్నాడు. వివరాల్లోకెళ్తే.. చేజర్ల మండలం పెళ్లేరు పంచాయతీ పరిధిలో సర్వే నంబరు 511లో ఐదు ఎకరాల భూమిని మిలటరీ మాజీ ఉద్యోగి చేజర్ల పెంచలయ్యకు 1976లో ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు కాగా, పసుపు కుంకుమల కింద చెరి రెండున్నర ఎకరాలు పంచి రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే ఆయన కుమార్తె దొంతాలి పెంచలమ్మకు చెందిన 2.50 ఎకరాల భూమిని సదరు నాయకుడు స్వాధీనం చేసుకొని సాగు చేస్తుండడంతో ఆమె భర్త ప్రసాద్ హైకోర్టులో కేసు దాఖలు చేశాడు. కోర్టు స్టేటస్ కో ఇచ్చినా సదరు నాయకుడు భూమిలో సాగు పనులు చేపట్టాడు. అడు గుతుంటే దిక్కున్న చోట చెప్పుకోవాలని బెదిరిస్తున్నాడని బాధిత కుటుంబం వాపోయింది. ఆత్మకూరు ఆర్డీఓ బి పావనిని కలిసి వివాదం గురించి తెలియజేసి వినతి పత్రం అందజేసింది.
ఆక్రమణే ఆయన నైజం
సదరు టీడీపీ నాయకుడు తప్పుడు స ర్టిఫికెట్లతో వీఆర్‌ఓగా కొంతకాలం పనిచేశాడు. తరువాత విచారణ జరిపి ఉద్యో గం నుంచి తొలగించారు. విధుల్లో ఉన్నప్పుడే దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములపై అతని కన్నుపడింది. పలువు రు కింది స్థాయి రెవెన్యూ అధికారులను లోబరుచుకొని భూములను ఆక్రమించుకొని రికార్డులు తారుమారు చేసి తన భూములుగా చెప్పుకుంటూ దర్జాగా సాగు చేస్తున్నాడు. పెళ్లేరు పంచాయతీ పుల్లనీళ్లపల్లి గ్రామంలో పెన్నానది తీరంలో సర్వే నంబర్లు 508, 509, 510, 511, 512లో 4 దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం కుటుంబానికి ఎకరా చొప్పున మొత్తం 43 ఎకరాలు పంపిణీ చేసింది. అయితే స్థానిక టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఆ భూమిని ఆక్రమించుకున్నాడు. గత ప్రభుత్వ కాలంలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి దీనిపై విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక అందజేయాలని అప్పటి ఆర్డీఓను ఆదేశించారు. విచారణ అనంతరం వివాదాస్పద భూముల్లోకి ఎవరూ వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. అయినా ఆ భూములను ఆయన సాగు చేస్తున్నట్లు బాధిత దళిత కుటుంబీకులు తెలిపారు. ఈ విషయమై ఆత్మకూరు ఆర్డీఓ బి పావనిని సంప్రదించగా మండల తహసీల్దారును ఆ భూముల విషయమై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు, ఆ నివేదిక మేరకు కలెక్టర్‌కు తెలియజేసి బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
కోర్టు స్టేటస్‌కో ఇచ్చినా బేఖాతరు
వివాదాస్పద భూముల్లో
సాగు పనులు
న్యాయం చేయాలని
ఆర్డీఓకు దళితుల విన్నపం
Comments
Please login to add a commentAdd a comment