కాలువ పూడికతీతలో రూ.30 కోట్లకు స్కెచ్
నెల్లూరు(బారకాసు): కనుపూరు కాలువ పూడికతీత పనుల ద్వారా రూ.30 కోట్లు దోచుకునేందుకు సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్కెచ్ వేశారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో అవినీతి జరిగిందంటూ చెబుతున్న సోమిరెడ్డి.. నిస్సిగ్గుగా రైతులను అడ్డుపెట్టుకుని దోచుకునేందుకు తెరతీశారన్నారు. టెండర్లకు కాలపరిమితి ఉన్నప్పటికీ తూతూ మంత్రంగా పనులు ముగించి బిల్లులు సిద్ధం చేస్తున్నారన్నారు. కనుపూరు కాలువ పూడికతీత కోసం రూ.6 కోట్లకు సంబంధించి పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిస్తే నాసిరకంగా నామమాత్రంగా పనులు పూర్తి చేశారన్నారు. దీనిని బట్టి చూస్తే ప్రజాధనాన్ని ఎలా దోచుకుంటున్నారో ఇట్టే అర్ధమవుతుందన్నారు. కనుపూరు కాలువ పూడిక తీత పనులను సక్రమంగా జరగడం లేదని వాటిని తాము పరిశీలిస్తామని రైతులు చెబితే వారిని వెళ్లనివ్వలేదన్నారు. అంతేకాకుండా తాను పరిశీలించేందుకు వెళ్తానంటే హౌస్ అరెస్ట్ చేయించారన్నారు. నవంబర్ 11వ తేదీ వరకు గడువు ఉంటే సోమిరెడ్డి 7వ తేదీనే కనుపూరు కాలువ వద్దకు వెళ్లి నీటిని విడుదల చేయించి 30 పొక్లెయిన్లు, 15 డోజర్లతో కాలువలో పూడిక తీత పనులు చేపట్టినట్లుగా పత్రికలకు స్టేట్ మెంట్ ఇచ్చారన్నారు. సర్వేపల్లిలో రూ.6 కోట్ల అవినీతితో పాటు మరో రూ.25 కోట్లకు ప్రతిపాదనలు పంపించారని చెప్పారు. అంటే నీరు పారేటప్పుడే ఆ పనులు చేసినట్లుగా దొంగ బిల్లులు చేసుకోవడానికి మొత్తంగా రూ.30 కోట్లకు స్కెచ్ వేశారని వివరించారు. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే సరైన సమాధానం చెప్పలేదన్నారు. విచారణలో ప్రజాధనం దుర్వినియోగమైందని రుజువైతే సంబంధిత అధికారులు ఎవరైనా సరే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. సర్వేపల్లిలో అనేక చోట్ల నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న మాట వాస్తవమని దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకునే పనైతే సాక్ష్యాధారాలతో సహా చూపిస్తామన్నారు. ఇటీవల తనను భయపెట్టి రూ.3లక్షలు డిమాండ్ చేశారని ఓ దళితుడు ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో చెప్పారని, ఈ విషయంలో సోమిరెడ్డిపై పోలీసులు కేసుపెట్టి విచారించాలన్నారు.
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి కాజేసేందుకు యత్నం
తూతూ మంత్రంగా పనులు ముగించి బిల్లులు సిద్ధం చేస్తున్నారు
విలేకరులతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment