సుపారీ ఇచ్చి.. పక్కా స్కెచ్‌ వేసి.. | - | Sakshi
Sakshi News home page

సుపారీ ఇచ్చి.. పక్కా స్కెచ్‌ వేసి..

Published Tue, Nov 26 2024 12:28 AM | Last Updated on Tue, Nov 26 2024 12:28 AM

సుపారీ ఇచ్చి.. పక్కా స్కెచ్‌ వేసి..

సుపారీ ఇచ్చి.. పక్కా స్కెచ్‌ వేసి..

నెల్లూరు(క్రైమ్‌): వినాయక ఉత్సవాల్లో జరిగిన వివాదంతో కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి రౌడీషీటర్‌లు, కొందరు వ్యక్తులకు సుపారీ ఇచ్చి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పై దాడి చేయించాడు. నిందితులు ప్రొఫెసర్‌ ఒంటిపైనున్న బంగారు ఆభరణాలను సైతం దోచుకెళ్లారు. ఈ ఘటనలో ఇద్దరు రౌడీషీటర్లతోపాటు మరో ఇద్దరు వ్యక్తులను నెల్లూరు చిన్నబజారు పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. సంగంకు చెందిన శ్రీనివాస మోహన్‌తేజ గూడూరులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అతడి పిన్ని మూలాపేట వేళాంగిణి స్కూల్‌ సమీపంలో ఉంటున్నారు. మోహన్‌తేజ ఈనెల 21వ తేదీ సాయంత్రం కళాశాల బస్సులో ఆ స్కూల్‌ వద్ద దిగి పిన్ని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా రెండు మోటార్‌బైక్‌ల్లో వచ్చిన ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. అతడిపై దాడి చేసి ఒంటిపైనున్న నాలుగున్నర సవర్ల బంగారు గొలుసు, ఒకటిన్నర సవర్ల బ్రాస్‌లెట్‌ను దోచుకుని పరారయ్యారు. ఈ మేరకు బాధితుడు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్‌ చిట్టెం కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతికత ఆధారంగా దోపిడీకి పాల్పడింది శెట్టిగుంట రోడ్డు పాతచెక్‌పోస్టు ప్రాంతానికి చెందిన రౌడీషీటర్‌ అబ్దుల్‌ అజీజ్‌, మైపాడురోడ్డుకు చెందిన రౌడీషీటర్‌ షేక్‌ బబ్లూ, స్టోన్‌హౌస్‌పేటకు చెందిన సుదర్శనం, సంగం మండలానికి చెందిన రూపేష్‌లు, మరో బాలుడిగా గుర్తించారు.

విచారించగా..

నలుగురు నిందితులను సోమవారం శెట్టిగుంటరోడ్డు పాతచెక్‌పోస్టు వద్ద ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌ చేశారు. బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా దాడి, దోపిడీ వివరాలను వెల్లడించారు. సంగంలో సెప్టెంబర్‌ నెలలో జరిగిన వినాయక ఉత్సవాల్లో శ్రీనివాస్‌ మోహన్‌తేజకు అదే ప్రాంతానికి చెందిన వేరొకరికి మధ్య వివాదం జరిగింది. దీంతో కక్ష పెంచుకున్న సదరు వ్యక్తులు కోవూరుకు చెందిన తమ బంధువు సురేంద్రరెడ్డిని సంప్రదించారు. ఎలాగైనా శ్రీనివాస్‌ మోహన్‌తేజపై కక్ష తీర్చుకోవాలని కోరారు. దీంతో సురేంద్రరెడ్డి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పై దాడి చేయాలని నిందితులకు రూ.25 వేలు సుపారీ ఇచ్చాడు. దీంతో నిందితులు రెండు రోజులు రెక్కీ వేశారు. ఈనెల 21వ తేదీ సాయంత్రం శ్రీనివాస్‌పై దాడి చేయడమే కాకుండా ఒంటిపైనున్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లారని విచారణలో వెల్లడించారు. దీంతో నిందితుల నుంచి రూ.2.50 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, దోపిడీకి వినియోగించిన రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో సురేంద్రరెడ్డిని అరెస్ట్‌ చేయాల్సి ఉందని, దాడికి పురమాయించిన వ్యక్తులు ఎవరో తెలియాల్సి ఉందని ఇన్‌స్పెక్టర్‌ కోటేశ్వరరావు తెలిపారు.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌పై దాడి,

దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్‌

పరారీలో సూత్రధారి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement