● చికిత్స పొందుతూ మృతి
కావలి: ఆ ఆటోలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ఓ మహిళ జారి రోడ్డుపై పడింది. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందిన ఘటన సోమవారం కావలిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కావలి పట్టణం, రూరల్ నుంచి జలదంకి మండలంలో వ్యవసాయ పనులకు ఆటోలో అధిక సంఖ్యలో మహిళలు బయలుదేరారు. ఇందులో పట్టణంలోని మద్దూరుపాడులో ఉన్న టిడ్కో కాలనీలో నివాసం ఉంటున్న మహిళలు కూడా ఉన్నారు. ఆటో కొద్దిసేపటికే పట్టణంలోని బొట్లగుంట వద్దకు చేరుకునే సరికి మితిమీరిన వేగం కారణంగా అదుపుతప్పగా డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో టిడ్కో కాలనీకి చెందిన బొగ్గవరపు సునీత అలియాస్ కామాక్షమ్మ (36) రోడ్డుపై పడిపోయింది. తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణిచింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కావలి రెండో పట్టణ ఎస్సై ఎం.గోపీచంద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇంట్లోకి చొరబడి వ్యక్తిపై దాడి
నెల్లూరు(క్రైమ్): ఇంటికి రావొద్దని హెచ్చరించిన ఓ వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు దాడిచేసి గాయపరిచిన ఘటనపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం వైఎస్సార్ నగర్‌కు చెందిన సురేష్ బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సంతోష్ మరో ఇద్దరు అతడికి పరిచయమయ్యారు. అందరూ స్నేహంగా ఉంటూ తరచూ సురేష్ ఇంట్లో మద్యం తాగేవారు. ఇటీవల వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. సురేష్ వారిని తన ఇంటికి రావొద్దని హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న సంతోష్, మరో ఇద్దరు ఈనెల 22వ తేదీ రాత్రి సురేష్ ఇంట్లోకి చొరబడి అతడిపై దాడిచేసి గాయపరిచారు. బాధితుడు సోమవారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment