మేం తాగితే.. ఈ లోకంతో పనిలేదు..
నెల్లూరు (వీఆర్సీసెంటర్): కూటమి ప్రభుత్వం వచ్చాక ఊరూరా, వీధివీధినా మద్యం దుకాణాలు, బెల్టు షాపులు విచ్చలవిడిగా ఏర్పాటయ్యాయి. ఇరవై నాలుగు గంటలూ మద్యం అందుబాటులో ఉండడంతో మందుబాబులు తాగి తూగుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిర్దిష్ట సమయంలో మద్యం దుకాణాలు తెరిచి విక్రయాలు చేపట్టడంతోపాటు దుకాణాల వద్ద తాగే పద్ధతికి కళ్లెం వేసింది. దీంతో మద్యం ప్రియులు ఇళ్లకు తీసుకెళ్లి తాగేవారు. కానీ కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం చేయడంతో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు తెరలేపింది. దీంతో మందు బాబులు ఎక్కడపడితే అక్కడ తాగి ఈ లోకంతో మాకు పని లేదన్నట్లుగా రోడ్లపై మత్తులో దొర్లాడుతున్నారు. ఇప్పటికే ఇళ్ల మధ్య, రద్దీ ప్రదేశాల్లో మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారంటూ మహిళలు, ప్రజాసంఘాలు ఆందోళన చేపడుతున్నా.. ఈ పాలకులకు, అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదు. నగరంలోని వెంకటేశ్వరపురంలో ఫూటుగా మద్యం తాగి రోడ్లపై రచ్చరచ్చ చేస్తూ, ఇలా రోడ్లపై పడిపోతున్న పరిస్థితులు నిత్యం చూసి ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసింది ఇందుకేనా? ఈ సమాజం ఏమైపోతుందని ప్రజలు నిలదీస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని అంటున్నారు. కూటమి నేతలు అధికారంలోకి రావడానికి అలవికాని హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకుండా, ఇలా ప్రజలను మద్యం మత్తులో ఉంచి కాలం గడుపుకుంటున్నారని అభ్యుదయ ప్రజాసంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment