కలెక్టరేట్ ఎదుట వలంటీర్ల ధర్నా
నెల్లూరురూరల్: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ గ్రామ, వార్డు వలంటీర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వలంటీర్ల యూనియన్ నాయకులు మాట్లాడుతూ పదో తరగతి నుండి డిగ్రీ వరకు చదివిన వారు వలంటీర్లుగా పని చేస్తున్నారని, గత ప్రభుత్వం వలంటీర్లకు ప్రశంసలు అవార్డులు, రివార్డులు ఇచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజీనామా చేసిన వాళ్లని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, వలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.10 వేల వేతనం ఇవ్వడంతో పాటు గత ఆరు నెలలుగా పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పెంచలయ్య, బాలు, అనిత, పుష్ప, సుజాత, సీఐటీయూ నాయకులు అల్లాడి గోపాల్, కె పెంచల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment