జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ ఓ ఆనంద్
నెల్లూరు రూరల్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఓ ఆనంద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయ న మాట్లాడుతూ భారీ వర్షాలకు జలమయం అయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. జిల్లా అధికారులు తమ సిబ్బందితో సహాయక చర్యలకు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలన్నారు. అత్యవసర సహాయం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 0861– 2331261కు సమాచారం అందించాలని కోరారు.
నేడు జాబ్‌మేళా
కోవూరు: ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్, ఉపాధి కల్పన శాఖ, సీడాప్ సంయుక్తంగా కోవూరులోని వైకేఆర్‌అండ్‌కే గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్‌మేళా జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీప్రసూన తెలిపారు. ఈ జాబ్‌మేళాలో ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ లిమిటెడ్, మెడ్‌ప్లస్, కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ ఫైనాన్స్ ఇంక్లూషన్ లిమిటెడ్, వీల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హీరో మోటో కార్ఫ్ లిమిటెడ్ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తారని వివరించారు. ఎంఎస్సీ, ఐటీఐ డిప్లొమా, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, బీటెక్ విద్యార్హతలు కలిగిన నిరుద్యోగులు ఈ జాబ్‌మేళాలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అబ్దుల్ ఖయ్యుం కోరారు. ఈ జాబ్‌మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు ఆధార్‌కార్డ్ జెరాక్స్, రెజ్యూమ్‌తో రావాలని, మరిన్ని వివరాలకు 63015 29271, 97045 10793 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఓవరాల్ చాంపియన్
జేబీ కళాశాల
నెల్లూరు (టౌన్): విక్రమ సింహపురి యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంటర్ కాలేజీయేట్ గేమ్స్ ఫర్ ఉమెన్ పోటీల్లో కావలి జవహర్ భారతి (జేబీ) డిగ్రీ కళాశాల విద్యార్థులు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను సాధించారు. స్థానిక డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో మూడు రోజులుగా జరుగుతున్నాయి. చివరి రోజు సోమవారం బాస్కెట్‌బాల్ పోటీల్లో వెంకటాచలంలోని అలెక్సా కళాశాల విద్యార్థులు ప్రథమ, కావలి జేబీ కళాశాల విద్యార్థులు ద్వితీయ బహుమతులు సాధించారు. వాలీబాల్ పోటీల్లో జేబీ కళాశాల ప్రథమ స్థానం, అలెక్సా కళాశాల ద్వితీయ స్థానం, యోగా పోటీల్లో జెనెక్స్ కళాశాల ప్రథమ స్థానం, డీకేడబ్ల్యూ కళాశాల ద్వితీయ స్థానం, టగ్‌ఆఫ్ వార్‌లో డీఆర్‌డబ్ల్యూ కళాశాల ప్రథమ స్థానం, డీకేడబ్ల్యూ కళాశాల విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు. ఆయా పోటీల్లో విజేతలకు డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గిరి సతీమణి గాయత్రి కప్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ కార్యదర్శి విజయకళ, పలువురు పీడీలు పాల్గొన్నారు.
విద్యుత్ సిబ్బందికి
సెలవులు రద్దు
● అన్ని డివిజన్లలో కంట్రోల్ రూమ్‌లు
● ఎస్‌ఈ విజయన్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ విజయన్ చెప్పారు. నగరంలోని విద్యుత్‌భవన్‌లో సోమవారం ఆయన జిల్లాలోని విద్యుత్‌శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని, విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలన్నారు. విద్యుత్ సిబ్బంది హెడ్ క్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాలోని ప్రధాన విద్యుత్‌భవన్‌తో పాటు 7 డివిజన్ల కేంద్రాల్లో ప్రత్యేక కంట్రోల్ రూములను ఏర్పాటు చేశామని, వర్షాలు తగ్గే వరకు ప్రతి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఇద్దరు సిబ్బందిని మాత్రమే ఉంచి మిగిలిన వారిని అత్యవసర సేవలకు వినియోగించుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాలు, రోప్స్, డ్రిల్లింగ్ మెషిన్ వంటి పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో ఈఈలు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment