కలెక్టరేట్ సాక్షిగా న్యాయం కోసం వ్యక్తి ఆత్మహత్యాయత్నం
నెల్లూరు (అర్బన్): రెవెన్యూ అధికారులు తనకు అన్యాయం చేస్తున్నారంటూ ఓ వ్యక్తి కలెక్టరేట్ సాక్షిగా ప్రజాసమస్యల పరిష్కార వేదిక వద్ద అధికారులు, పోలీసులు, ప్రజల సమక్షంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అతడి చేతిలో అగ్గిపెట్టె లాక్కొని, క్యాన్‌తో నీరు పోసి అడ్డుకున్నారు. ఈ ఘటన సోమవారం కలెక్టరేట్‌లో జరిగింది. విషయం తెలుసుకున్న డీఆర్‌ఓ ఉదయభాస్కర్‌రావు బాధితుడి వద్దకు వచ్చి విచారించారు. బాధితుడు వెంగమశెట్టి బాలయ్య కథనం మేరకు.. తనకు కావలి మున్సిపల్ పరిధిలోని బుడమగుంట వద్ద ఇందిరమ్మ కాలనీలో దివంగత సీఎం వైఎస్సార్ హయాం 2007లో ప్రభుత్వం 4 సెంట్ల స్థలాన్ని పట్టాగా ఇచ్చిందన్నారు. తాను చైన్నె వెళ్లి పనులు చేసుకుని 17 ఏళ్లు కష్టపడి రూ.13 లక్షలు సంపాదించుకుని ఇల్లు కట్టుకున్నానన్నారు. అయితే తనకు ఇచ్చిన పట్టాలో సర్వే నంబర్ తప్పు పడిందన్నారు. ఇలా తనతో పాటు మరో 8 మందికి ఇలా సర్వే నంబర్ తప్పు వచ్చిందన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కృష్ణమూర్తి అనే వ్యక్తి బినామీ పేర్లతో దొంగ పట్టాలు సృష్టించి 2023 నుంచి తన ఇంటిని కబ్జా చేయాలని చూస్తూ తనను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. అతడికి వీఆర్వో మహేశ్వరరావు, వీఆర్‌ఏలు భాస్కర్, వెంకయ్య సహకరిస్తున్నారన్నారు. ఈ విషయమై కావలి తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయంలో పలు సార్లు అర్జీలు ఇచ్చి సర్వే నంబర్‌ను సరి చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో విధిలేక కలెక్టరేట్ వద్ద ప్రాణత్యాగం చేశానని బాలయ్య విలపిస్తూ వాపోయాడు. బాధితుడి పరిస్థితిని తెలుసుకున్న డీఆర్వో ఉదయభాస్కర్ సర్వే నంబర్ సరి చేయించి ఇబ్బందులు లేకుండా చేస్తామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చాడు.
అడ్డుకున్న పోలీసులు
న్యాయం చేస్తామని డీఆర్వో హామీ
Comments
Please login to add a commentAdd a comment