‘‘ఏం లాభం లేదప్పా... ఎవరితో పొత్తు ఉంటుందో తెలియదు. సీటు పొత్తులో పోతుందా...ఇస్తే ఎవరికిస్తారో తెలియదు... ఇప్పటి నుంచే జనాల్లో తిరుగుతూ డబ్బు పెట్టుకుంటూ పోతే చివరకు గుండు సున్నా. ప్రస్తుతం పార్టీ పరిస్థితీ బాగోలేదు..జిల్లాలో చాలాచోట్ల సీట్లిచ్చినా గెలిచే పరిస్థితి లేదు... అందుకే ఇంటికే పరిమితమైన’’
– టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుడితో ఓ నేత ఆవేదన ఇది.. జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలది ఇదే పరిస్ధితి.
సాక్షి, పుట్టపర్తి: ఇన్నాళ్లూ టికెట్ కోసం పోటీ పడిన తెలుగు తమ్ముళ్లు... ప్రస్తుతం మౌన ముద్రలో ఉండిపోయారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పోటీ చేస్తే ఓటమి తప్పదని తెలుసుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. చివరకు నియోజకవర్గంలోని ప్రజలనూ కలవడం మానేశారు. దీనికి తోడు జనసేనతో పొత్తు కుదిరితే ఆ పార్టీ నేతలకు టికెట్ ఇస్తారేమోనన్న సందేహం ఓ వైపు వెంటాడుతోంది. ఫలితంగా కార్యకర్తల్లోనూ గందరగోళం నెలకొంది. ఎటు పోవాలి.. ఏ నాయకుడి వద్ద ఉంటే మంచి జరుగుతుందో తెలియక సందిగ్ధంలో పడిపోయారు.
ఇళ్లకే పరిమితమైన ‘పచ్చ’ నేతలు..
జనాలు వెంట రాకపోవడంతో జిల్లాలోని పలు నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జ్‌లు కూడా బయట తిరగడం మానేశారు. రెండు నెలలుగా కార్యకర్తల యోగ క్షేమాలను సైతం పట్టించుకున్న దాఖలాలు లేవు. కదిరిలో మైనార్టీలకు టికెట్ ఇస్తారని ఇన్‌చార్జ్‌గా ఉన్న కందికుంట వెంకట ప్రసాద్ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పుట్టపర్తిలో బీసీ సామాజికవర్గం లేదా కమ్మ కులానికి టికెట్ ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతుండటంతో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నిరుత్సాహంలో ఉన్నారు. ధర్మవరం టికెట్ జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
పుట్టపర్తి బీసీలకేనా?
జిల్లా కేంద్రం పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఉన్నారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే గ్రూపు రాజకీయం నడుస్తోంది. దీంతో ఆయనకు బదులు బీసీ సామాజికి వర్గానికి చెందిన వారికి టికెట్ ఇస్తే ఎలాంటి సమస్యా ఉండదనే నిర్ణయం అధిష్టానం తీసుకుందని ‘తమ్ముళ్లు’ చెబుతున్నారు. దీంతో పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తిలో సొంత పనులకే పరిమితమయ్యారు. పల్లె వెంట తిరిగేందుకు ‘తమ్ముళ్లు’ కూడా వెనుకడుగు వేస్తున్నారు. బీసీ వర్గాలకు టికెట్ లేదంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉంది.
ధర్మవరం సీటు జనసేనకేనంటూ ప్రచారం..
నాలుగేళ్లుగా పరిటాల శ్రీరామ్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పరిటాల శ్రీరామ్ కూడా ఖర్చు తప్ప లాభం లేదని భావించి మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరదాపురం సూరి ఇప్పటికీ బీజేపీలోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ నేతకే టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో టీడీపీలో చేరేందుకు వరదాపురం సూరి సంకోచిస్తున్నారు.
కదిరి మైనార్టీలకేనా?
కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా కందికుంట వెంకట ప్రసాద్ చాలా ఏళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే 2009 ఎన్నికల్లో మాత్రమే ఆయన విజయం సాధించారు. మూడుసార్లు ఓడిపోయారు. ఈసారి టికెట్ ఇచ్చినా... మరోసారి ఆయన ఓటమి ఖాయమని సర్వేలో తేలినట్లు తెలిసింది. ఫలితంగా ఆయన బదులు మైనార్టీలకు టికెట్ కేటాయించే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కందికుంట వెంకట ప్రసాద్ సొంత పనులకే పరిమితమయ్యారని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాల్లో ఆయన కనిపించడం లేదు.
‘యువగళం’తర్వాత గప్‌చుప్..
జిల్లాలో ‘యువగళం’ పాదయాత్ర సమయంలో నారా లోకేశ్ వెంట నడిచేందుకు నాయకులు ఆసక్తి చూపారు. ఆ తర్వాత ఎలాంటి కార్యక్రమూ నిర్వహించలేదు. ఇటీవల నిర్వహించిన టీడీపీ బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ కావడంతో నాయకులు నిరుత్సాహంలో పడ్డారు. కార్యకర్తలు కూడా వెంట రాకపోవడంతో పోటీ చేసేందుకు చాలా మంది విముఖత వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment