కబ్జాల ఖల్‌నాయక్‌ | - | Sakshi
Sakshi News home page

కబ్జాల ఖల్‌నాయక్‌

Published Thu, Sep 26 2024 1:06 AM | Last Updated on Thu, Sep 26 2024 1:06 AM

కబ్జా

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌

పుట్టపర్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములపై పెడపల్లి గ్రామ పంచాయతీ పెద్ద తండాకు చెందిన వి.శ్రీరామ్‌నాయక్‌ కన్నేశాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుంచే ఆక్రమణల పర్వం ప్రారంభించాడు. దొంగ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి.. వాటిని దర్జాగా విక్రయించి డబ్బులు పోగు చేసుకుంటున్నాడు. తోపు పోరంబోకు, డిజిటల్‌ లైబ్రరీ, ఈద్గా స్థలం, కర్మకాండలకు కేటాయించిన ప్రాంతం.. ఇలా ప్రభుత్వ భూములన్నీ ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుని జేసీబీలతో చదును చేయిస్తున్నాడు. సెంట్ల లెక్కన రూ.లక్షలకు అమ్మేస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నాడు. నిర్మాణాలు ఆపాలని అధికారులు నోటీసులు జారీ చేసినా.. బేఖాతరు చేస్తున్నాడు. చివరకు రోడ్లకు కేటాయించిన స్థలాన్నీ కబ్జా చేసి ఇల్లు నిర్మిస్తున్నాడు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అండతోనే శ్రీరామ్‌నాయక్‌ దందాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

మగాడు ఎవడైనా రావొచ్చంటూ సవాల్‌..

రెవెన్యూ అధికారుల ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాలు సృష్టిస్తున్న శ్రీరామ్‌ నాయక్‌... ప్రభుత్వ భూములను దర్జాగా విక్రయిస్తున్నాడు. తమ పార్టీ (టీడీపీ) అధికారంలోకి వచ్చిందని.. అడ్డొచ్చిన వాడిని తాట తీస్తానంటూ బెదరింపులకు దిగుతున్నాడు. ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే ‘మగాడు ఎవడైనా ఉంటే... వచ్చి ఢీకొనవచ్చు’ అంటూ సవాల్‌ విసురుతున్నాడు.

దందాల్లో కొన్ని ..

● పుట్టపర్తి మండలం పెడపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో 564–4 సర్వే నంబరులో 12 సెంట్లు తోపు పోరంబోకుగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. అయితే ఆ భూమిని శ్రీరామ్‌నాయక్‌ ఆక్రమించాడు. భవన నిర్మాణాలు చేపట్టాడు. నిర్మాణం ఆపాలని అధికారులు నోటీసులు పంపినా ఖాతరు చేయలేదు.

● పెడపల్లి గ్రామ పరిధిలో సర్వే నంబరు 139లో ఉన్న ఈద్గా.. ఎన్‌హెచ్‌ 342 నిర్మాణంలో పోతోంది. గ్రామస్తుల కోరిక మేరకు పంచాయతీ తీర్మానం ప్రకారం ఈద్గా కోసం సర్వే నంబరు 139–1లో 56 సెంట్లు కేటాయించారు. ఆ స్థలాన్ని ఆక్రమించిన శ్రీరామ్‌ నాయక్‌ జేసీబీలతో చదును చేయించి సెంటు రూ.4 లక్షలు చొప్పున విక్రయిస్తున్నాడు

● పెడపల్లి గ్రామ పరిధిలో సర్వే నంబరు 157–1, 157–2లో ఉన్న 8 సెంట్ల స్థలాన్ని గత ప్రభుత్వం డిజిటల్‌ లైబ్రరీ కోసం కేటాయించింది. అప్పటి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి భూమిపూజ చేశారు. అయితే ఆ స్థలానికి దొంగ పట్టాలు సృష్టించి.. సెంటు రూ.5 లక్షలు చొప్పున అమ్మేశాడు.

● పెడపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నంబరు 148–2లో ఉన్న 17 సెంట్లను షెడ్యూల్డ్‌ తెగల కులాల వారు కర్మకాండలు చేసుకునేందుకు కేటాయించారు. ఆ స్థలాన్ని శ్రీరామ్‌ నాయక్‌ ఆక్రమించి జేసీబీలతో చదును చేయిస్తున్నాడు. అడ్డొచ్చిన వారి తోలు తీస్తాన ంటూ బెదిరిస్తున్నాడు.

● పెడపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబరు 148–1లో ఉన్న లేఅవుట్‌కు వెళ్లేందుకు 30 అడుగుల రోడ్డును వదిలారు. అందులో ఐదు అడుగుల వరకు కబ్జా చేసి ఇల్లు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఎవరు చెప్పినా.. వినేది లేదంటున్నాడని స్థానికులు వాపోతున్నారు.

నిబంధనల ఉల్లం‘ఘనుడే’

● మట్కా, గ్యాంబ్లింగ్‌, పేకాట, క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడించడంలో శ్రీరామ్‌నాయక్‌ దిట్ట. ఇప్పటికే చాలాసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత మామూళ్లు ఇస్తూ.. తండా పరిధిలో 30 దుకాణాలు నిర్వహిస్తూ.. కర్ణాటక మద్యం విపరీతంగా విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. శ్రీరామ్‌నాయక్‌ సోదరుడు గోవింద నాయక్‌ భార్య తండాకు మొత్తం మద్యం సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. బస్టాండు సమీపంలో మంచి నీళ్ల ట్యాంక్‌ను కడితే.. ఇంటి వాస్తు కోసం దాన్ని పడగొట్టి. ప్రహరీ లోపలకు వేసుకున్నాడు.

● తన బంధువు ఒకరు ముంబయిలో కలెక్టర్‌ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పి.. ధర్మవరంలో ఓ కుటుంబంతో వివాహ సంబంధం మాట్లాడాడు. అమ్మాయి తరఫు వారితో ఏకంగా రూ.కోటి కట్నం తీసుకుని వివాహం చేయించాడు. అయితే తర్వాత ఆ యువకుడు కలెక్టర్‌ కాదని తేలగా.. ఇరు కుటుంబాలు చర్చించుకుని విడాకులకు సిద్ధమయ్యారు. కట్నంగా ఇచ్చిన రూ.కోటి సొమ్మును నెల రోజుల్లో ఇస్తానని పోలీసుల సమక్షంలో ఒప్పుకున్న శ్రీరామ్‌నాయక్‌ ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. రాష్ట్రంలో కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక స్వగ్రామానికి వచ్చి మళ్లీ దందాలు కొనసాగిస్తున్నాడు.

ఆరోపణలు.. వీరిపైనే

పెడపల్లిలో దొంగపట్టాలు సృష్టించి రెవెన్యూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసేందుకు కొందరు ముఠాగా ఏర్పడినట్లు తెలిసింది. వారు ఫేక్‌ డాక్యుమెంట్లు సృష్టించాక వాటితో రంగంలోకి దిగి కబ్జా చేయడంలో శ్రీరామ్‌ నాయక్‌ పేరు ఏ–1గా వినిపిస్తోంది. ఆయన తమ్ముళ్లు సామ్యా నాయక్‌, తిప్పా నాయక్‌ కూడా ఇందుకు సహకరిస్తున్నట్లు సమాచారం

పుట్టపర్తిలో ‘తమ్ముడి’ దాదాగిరి

ఫోర్జరీ సంతకాలు.. నకిలీ పట్టాలు

అధికారులనే బురిడీ కొట్టిస్తున్న వైనం

ప్రభుత్వ భూములన్నీ తన గుప్పిట్లోనే..

నిత్యం వివాదాల్లో

పెడపల్లి శ్రీరామ్‌నాయక్‌

మాజీ మంత్రి ‘పల్లె’ అండ చూసుకుని వీరంగం

గతంలోనూ ఫిర్యాదులు

పెడపల్లి తండాకు చెందిన శ్రీరామ్‌నాయక్‌ గతంలో ముంబయిలో లేబర్‌ కాంట్రాక్టరుగా ఉండేవాడు. జిల్లాకు చెందిన వారిని అక్కడికి తీసుకువెళ్లి పనిచేయించేవాడు. అయితే జీతంలో కోతలు విధిస్తున్నాడని చాలామంది వెళ్లడం మానేశారు. ఇక ముంబయిలో కొన్ని స్థలాలు ఆక్రమించి.. షెడ్లు వేసి.. వాటిని విక్రయించాడు. అక్కడ ఓ హత్య కేసులో ఇరుక్కుని ముంబయి ఖాళీ చేశాడు.

పెడపల్లి సర్పంచ్‌గా శ్రీరామ్‌నాయక్‌ (2006 – 2013) పని చేశారు. ఆ సమయంలో విద్యుత్‌ ఏఈగా పని చేస్తున్న మహిళపై భౌతికదాడి చేయగా కేసు నమోదు చేశారు.

గ్రేటర్‌ ముంబయి కార్పొరేషన్‌ నుంచి తన పిల్లలకు తప్పుడు జనన ధ్రువీకరణ పత్రం తీసుకుని వచ్చి.. 2014 ఎన్నికల్లో తన భార్య లక్ష్మీబాయిని జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో దింపాలని ప్రయత్నించాడు. అధికారులు నామినేషన్‌ను రద్దు చేశారు.

మంగీబాయి, హేమ్లీబాయి, శ్రీనివాసనాయక్‌కు చెందిన ప్లాట్ల పత్రాలను ట్యాంపరింగ్‌ చేసి గొర్రెల కాపరి వెంకటరామ నాయక్‌కు విక్రయించాడు. అయితే స్థలం మాత్రం స్వాధీనం చేయలేదు.. తర్వాత ఆయన డిమాండ్‌ చేసినప్పటికీ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. అదంతా ప్రభుత్వ భూమి కావడంతో ఆ కేసులో శ్రీరామ్‌ నాయక్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

రాష్ట్రంలో కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చాక తెలుగు తమ్ముళ్లు అడ్డగోలుగా సంపాదించేందుకు అడ్డదారులు వెతుకుతున్నారు. కొందరు సహజ సంపదను కొల్లగొడుతుండగా.. మరికొందరు ‘ప్రభుత్వం మాదే.. ప్రభుత్వ స్థలాలూ మావే’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఖాళీ స్థలం

కనబడితే కబ్జా చేస్తున్నారు. ఇందుకోసం అధికారుల సంతకాలనూ ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు.

పుట్టపర్తి నియోజకవర్గంలో ఈ దందా జోరుగా సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
కబ్జాల ఖల్‌నాయక్‌1
1/3

కబ్జాల ఖల్‌నాయక్‌

కబ్జాల ఖల్‌నాయక్‌2
2/3

కబ్జాల ఖల్‌నాయక్‌

కబ్జాల ఖల్‌నాయక్‌3
3/3

కబ్జాల ఖల్‌నాయక్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement