లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

Published Sun, Oct 20 2024 12:44 AM | Last Updated on Sun, Oct 20 2024 12:44 AM

లోక్‌

అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ

హిందూపురం అర్బన్‌: లోక్‌ అదాలత్‌ వల్ల కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని, తద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ పేర్కొన్నారు. శనివారం స్థానిక అదనపు జిల్లా కోర్టు ఆవరణలో లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. బాధితుల నుంచి సమస్యలను వినతుల రూపంలో జడ్జి స్వీకరించారు. ఇరువర్గాలతో చర్చించి కేసుల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. లోక్‌ అదాలత్‌కు హాజయ్యే అధికారులు, ఆయా కేసులకు సంబంధించిన సమగ్ర సమాచారంతో రావాలన్నారు. హిందూపురం రైల్వే రోడ్డు విస్తరణలో భాగంగా మున్సిపల్‌ అధికారులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ దుకాణాలను తొలగిస్తున్నారని పలువురు వ్యాపారులు లోక్‌ అదాలత్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, కోర్టు తీర్పు ఇవ్వకముందే దుకాణాలు తొలగించడం చట్టవిరుద్ధమన్నారు. హిందూపురంలో ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్‌, క్లినిక్‌ల నిర్వాహకులు బయోవ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని న్యాయవాది నవేరా లోక్‌ అదాలత్‌లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు రాజశేఖర్‌, ప్రభుత్వ న్యాయవాది శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ వన్నెరప్ప, న్యాయవాదులు సుదర్శన్‌, సిద్దూ, నాగరాజురెడ్డి, సంతోషికుమారి పాల్గొన్నారు.

కుళ్లిన వేరుశనగ..

ఒరిగిన వరి

వర్షాలతో ఖరీఫ్‌ పంటలకు తీవ్ర నష్టం

పుట్టపర్తి అర్బన్‌: అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖరీఫ్‌లో వేసిన పంటలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వేరుశనగ రైతు పరిస్థితి ముందుకెళ్తే నుయ్యి.. వెనక్కు వస్తే గొయ్యిలా మారింది. 62,410 హెక్టార్లలో సాగు చేసిన పంట.. తొలగించే సమయం ఆసన్నం కావడంతో ఈ వర్షాలకు పంట తొలగించినా నష్టమే, తొలగించకున్నా నష్టమేనని రైతులు చెబుతున్నారు. పంట తొలగించక పోతే చెట్లలోనే మొలకలు వస్తాయని, తొలగించినా కట్టె తడిసిపోయి మొలకలు, రావడం, కట్టె కుళ్లిపోయే పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఇక ఖరీఫ్‌లో ముందస్తుగా వేసిన వరి కూడా ప్రస్తుతం కోతకు వచ్చింది. తాజా వర్షాలతో పంట నేలకు ఒరిగిపోయింది. దీంతో పొలంలోనే గింజలు రాలి మొలకలు వస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కంది కూడా పూత రాలిపోయింది. మరో మూడు రోజుల్లో మరో తుపాను వస్తుందన్న వాతావరణ శాఖ సూచనలతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు.

28 మండలాల్లో కురిసిన వర్షం..

తుపాను ప్రభావంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకూ జిల్లాలోని 28 మండలాల్లో వర్షం కురిసింది. నల్లచెరువు మండలంలో అత్యధికంగా 58.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక తాడిమర్రి మండలంలో 48.4 మి.మీ, సీకేపల్లి 45.6, బత్తలపల్లిలో 42.4, ఎన్‌పీ కుంట 42.2, ధర్మవరం 38.4, గోరంట్ల 38.2, రామగిరి 29.8, అగళి 28.6, ముదిగుబ్బ 19.4, రొళ్ల 17.4, పెనుకొండ 15.4, బుక్కపట్నం 15, కనగానపల్లి మండలంలో 10.2 మి.మీ మేర వర్షపాతం నమోదైంది. మిగతా 14 మండలాల్లో 1.6 మి.మీ నుంచి 10 మి.మీ మేర వర్షం కురిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
లోక్‌ అదాలత్‌తో  సత్వర న్యాయం 1
1/1

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement