పింఛన్లు తొలగిస్తారా? | - | Sakshi
Sakshi News home page

పింఛన్లు తొలగిస్తారా?

Published Sun, Oct 20 2024 12:44 AM | Last Updated on Sun, Oct 20 2024 5:27 PM

వాడీవేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం

పేదల కడుపు కొడతారా..

గళమెత్తిన జెడ్పీటీసీ సభ్యులు

భారీ వర్షాలతో అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయని ఆందోళన

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌

తాగు, సాగునీటిపైనా సుదీర్ఘ చర్చ

వాడీవేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం

అనంతపురం సిటీ: రాజకీయ కక్షతో సామాజిక పింఛన్లు తొలగిస్తారా అంటూ జెడ్పీటీసీ సభ్యులు మండిపడ్డారు. భారీ వర్షాలతో అన్ని రకాల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని, అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అధ్యక్షతన అనంతపురంలోని జెడ్పీ కార్యాలయ సమావేశ భవన్‌లో శనివారం సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి సత్యకుమార్‌, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. పింఛన్ల తొలగింపు, రైతాంగం సమస్యలు, తాగు, సాగునీటి అవసరాలపై చర్చ సాగింది.

ఇప్పుడెందుకు అనర్హులయ్యారు?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పేదల పింఛన్లు తొలగించడం దారుణమని కనగానపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు కుంపటి భాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు జోక్యం చేసుకుంటూ అనర్హుల పింఛన్లు మాత్రమే తొలగించామని చెప్పగా... జెడ్పీటీసీ సభ్యులందరూ ఒక్కసారిగా గళమెత్తారు. అన్ని అర్హతలు ఉన్న వారికే గతంలో పింఛన్లు మంజూరు చేశారని, వారంతా ఇప్పుడు ఎలా అనర్హులవుతారని నిలదీశారు. రాజకీయ కక్షతో పేదల కడుపు కొడితే మీకేమొస్తుందంటూ మండిపడ్డారు. జిల్లాలో 5,908 వృద్ధాప్య పింఛన్లు, 519 దివ్యాంంగుల పింఛన్లు తొలగించినట్లు అధికారులే తమకు సమాచారం ఇచ్చారని, గతంలో అన్ని అర్హతలు ఉన్నాయని మంజూరు చేసిన అధికారులే ఇప్పుడు అనర్హులంటూ ఎలా తొలగిస్తారని చైర్‌పర్సన్‌ గిరిజమ్మ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, జెడ్పీటీసీ సభ్యుల మధ్య మాటలయుద్ధం నడిచింది. జెడ్పీ చైర్‌పర్సన్‌ కల్పించుకుని నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

భారీ వర్షాలతో పంటలన్నీ నాశనం

ఎడతెరిపి లేని వర్షాలతో అన్ని రకాల పంటలు నాశనమయ్యాయని, కోట్లాది రూపాయల పెట్టుబడి నేలపాలైనట్లు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో వేరుశనగ, సజ్జ పంట పూర్తిగా పాడైందని, వేరుశనగ భూమిలోనే కుళ్లిపోగా, ఆకు కూడా గ్రాసానికి పనికి రాకుండాపోయిందని అమడగూరు జెడ్పీటీసీ సభ్యురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కళ్యాణదుర్గం, రాయదుర్గం, కణేకల్లు ప్రాంతాల్లో ఎక్కువగా మిరప సాగు చేస్తారని, ఆయా ప్రాంతాల్లో శీతల గిడ్డంగులు నిర్మిస్తే రైతులకు మేలు చేసిన వారవుతారని గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు మహేశ్‌ సమావేశం దృష్టికి తెచ్చారు. వర్షాలతో వేరుశనగ పంట పాడైందని, రైతులకు ఉచితంగా విత్తన కాయలు సరఫరా చేయాలని విడపనకల్లు జెడ్పీటీసీ సభ్యుడు హనుమంతు విజ్ఞప్తి చేశారు. రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు నిల్వ లేవని, రైతులకు చిరుధాన్యాలు సరఫరా చేసి సాగు చేసేలా ప్రోత్సహించాలని కంబదూరు జెడ్పీటీసీ సభ్యుడు నాగరాజు కోరారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని అనంతపురం రూరల్‌ జెడ్పీటీసీ చంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌కు సంబంధించి మండల తీర్మానం లేకుండా పంచాయతీ తీర్మానాలతో పనులు మొదలుపెడుతున్నారని బెళుగుప్ప ఎంపీపీ పెద్దన్న తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమానికి జెడ్పీటీసీ సభ్యులను పిలవకపోవడం ఎంత వరకు సమంజసమని సభ్యులు ప్రశ్నించారు. నల్లమాడ ఎంపీపీ సునీతబాయి మాట్లాడుతూ మండలానికి వేరుశనగ విత్తన కాయలు, ఎరువులు ఎన్నొచ్చాయనే వివరాలను వ్యవసాయాధికారులు తమకు తెలపడం లేదన్నారు. రామగిరి జెడ్పీటీసీ నాగార్జున మాట్లాడుతూ పేరూరు డ్యామ్‌కు నీరు వదలాలని, పెండింగ్‌ ఉన్న హంద్రీ–నీవా కాలువ పనులను పూర్తి చేయాలన్నారు.

చెరువులు నింపండి

తమ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలను హంద్రీ–నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలతో నింపాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కోరారు. శ్రీసత్యసాయి జిల్లాలో పని చేసే ఏ శాఖ అధికారి కూడా జెడ్పీ సమావేశాలకు రావడం లేదని, కలెక్టర్‌ కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలాగని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
No Headline1
1/1

No Headline

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement