రాప్తాడు రూరల్: సరదాగా మద్యం తాగిన స్నేహితుల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి వివాదం ఒకరిపై హత్యాయత్నానికి దారి తీసింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు... బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి సమీపంలోని కాలనీలో నివాసం ఉంటున్న చిన్నదేవ, అనంతపురం నగరానికి చెందిన హరీష్ స్నేహితులు. ఓ మహిళ విషయంగా ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 24న హరీష్, చిన్నదేవ.. వారి స్నేహితులతో కలసి అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి సమీపంలో ఉన్న ఓ తోటలో మందు పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఫూటుగా మద్యం సేవించిన తర్వాత చిన్నదేవ, హరీష్ మధ్య సదరు మహిళ విషయం చర్చకు వచ్చింది. అది చినికిచినికి గాలివానలా మారడంతో హరీష్ తన స్నేహితులతో కలసి చిన్నదేవపై దాడికి పాల్పడ్డాడు. తలపై రాయితో బాది, కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేశారు. చిన్నదేవకు కాలు విరిగింది. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అది చూసి భయపడిన స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. రాత్రి 11 గంటల సమయంలో మెలుకువ వచ్చిన బాధితుడు తనను కాపాడాలంటూ గట్టిగా కేకలు వేయడంతో సమీపంలోని తోటలో ఉన్న రైతు గమనించి డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న అనంతపురం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment