వందశాతం లక్ష్యాలు సాధించాలి
అనంతపురం అగ్రికల్చర్: మార్కెటింగ్ శాఖ నిర్దేశించిన ఫీజు వసూళ్ల లక్ష్యాన్ని అన్ని కమిటీలు వందశాతం సాధించాలని ఆ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సి.రామాంజనేయులు ఆదేశించారు. శనివారం అనంతపురంలోని మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ఏడీఎంలు పి.సత్యనారాయణచౌదరి, ఎల్‌ఎన్ మూర్తితో కలిసి 17 మార్కెట్ కమిటీల సెక్రెటరీలు, సూపర్‌వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లా పరిధిలో ఉన్న 9 మార్కెట్ కమిటీలు, 15 చెక్‌పోస్టుల ద్వారా ఈ ఏడాది రూ.12.06 కోట్లు లక్ష్యం కాగా.. గడిచిన ఏడు నెలలకు గాను 46 శాతంతో రూ.5.54 కోట్లు వసూలైందన్నారు. గతేడాది కన్నా ఈసారి రూ.78 లక్షల వరకు ఆదాయం తగ్గిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతపురం, శింగనమల, తాడిపత్రి కమిటీల పరిస్థితి బాగానే ఉన్నా మిగతా వాటిల్లో పురోగతి లేదన్నారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో ఉన్న 8 మార్కెట్ కమిటీలు, 16 చెక్‌పోస్టుల ద్వారా ఈ ఏడాది రూ.5.31 కోట్లు టార్గెట్ కాగా ఇప్పటి వరకు 53 శాతంతో రూ.2.81 కోట్లు వసూలు చేశారని తెలిపారు. ఇక్కడ కూడా గతేడాది కన్నా రూ.7 లక్షల వరకు తక్కువగా ఉందన్నారు. విజిలెన్స్ బృందాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. చెక్‌పోస్టులు, మార్కెట్‌యార్డుల్లో నిఘా పెంచాలన్నారు. పశువులు, జీవాలు, చీనీ, చింత, మిరప తదితర క్రయ విక్రయాల్లో లీకేజీలను పూర్తిగా అరికడితే అనుకున్న ఫలితాలు వస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment