కూరగాయల సాగుపై ఆసక్తి
పుట్టపర్తి అర్బన్: నిత్యావసరాల్లో ఒక్కటైన కూరగాయాల ధర మార్కెట్‌లో నిలకడగా ఉండడంతో చాలా మంది రైతులు ప్రస్తుతం కూరగాయల సాగుపై దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కూరగాయల పంటలతో పాటు దోస, పూల తోటలను సుమారు 26,347 హెక్టార్లలో సాగులోకి వచ్చింది. ఇందులో అత్యధికంగా టమాట, వంకాయ, బీర, కాకర, చిక్కుడు, అనప, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, క్యారెట్, క్యాబేజీ తదితర కూరగాయలు ఉన్నాయి.
26,347 హెక్టార్లలో సాగు
జిల్లా వ్యాప్తంగా 26,347 హెక్టార్లలో కూరగాయలు, ఆకు కూరలు, దోస, కలింగర, పూల తోటలు సాగులో ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 19,963 హెక్టార్లలో టమాట సాగులో ఉంది. 356 హెక్టార్లలో వంకాయ, 540 హెక్టార్లలో అనప, 348 హెక్టార్లలో ఉర్లగడ్డ, 1,433 హెక్టార్లలో ఎండు మిర్చి, 1,040 హెక్టార్లలో పచ్చి మిర్చి, 356 హెక్టార్లలో గోరుచిక్కుడు, 374 హెక్టార్లలో ఉల్లి, 1,097 హెక్టార్లలో ఇతర కూరగాయలు, ఆకుకూరల పంటలు సాగులో ఉన్నాయి.
నిలకడగా ధరలు
తరచూ కూరగాయల ధరలు ఎగుడు దిగుడుగా మారి రైతులకు నష్టాలను మిగుల్చుతూ వచ్చాయి. అయితే నెల రోజులుగా ధర నిలకడగా ఉండడంతో పలువురు రైతులు సాగు చేసిన కూరగాయలకు గిట్టుబాటు ధర లభ్యమవుతోంది. 13 కిలోల టమాట బాక్సు రూ.400, 10 కిలోల వంకాయల బస్తా రూ.250, 50 కిలోల ఉర్లగడ్డ బస్తా రూ.2,200, కిలో అనపకాయలు రూ.40, కిలో చిక్కుడు రూ.40 , కిలో పచ్చి మిరప రూ.50, ఎండు మిర్చి టన్ను రూ.15 వేల నుంచి రూ.20 వేలు, 50 కిలోల ఉల్లి బస్తా రూ.1,500 నుంచి రూ.2వేల వరకూ అమ్ముడు పోతున్నాయి.
మార్కెట్ సదుపాయం లేక ఇబ్బంది
జిల్లాలో రైతుల పంట ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం లేదు. దీంతో చాలా మంది రైతులు బాగేపల్లి, డీ క్రాస్, మదనపల్లి, బెంగళూరు, చైన్నె, అనంతపురం తదితర మార్కెట్‌లకు కూరగాయలను తరలించాల్సి వస్తోంది. స్థానికంగా హిందూపురం, కదిరి, గోరంట్ల , ధర్మవరం వంటి ప్రాంతాల్లో మార్కెట్‌లు ఏర్పాటు చేయాలని చాలా కాలంగా రైతులు కోరుతున్నారు. ఉద్యాన పంటలపై దృష్టి సారించిన ప్రభుత్వం.. స్థానికంగా రైతుల పంట ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.
26వేల హెక్టార్లలో వివిధ రకాల
కూరగాయల పంటలు
మార్కెట్‌లో ధర నిలకడతో
రైతుల్లో హర్షం
Comments
Please login to add a commentAdd a comment