వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి దుర్మరణం

Published Mon, Nov 25 2024 7:07 AM | Last Updated on Mon, Nov 25 2024 7:06 AM

వ్యక్తి దుర్మరణం

వ్యక్తి దుర్మరణం

సోమందేపల్లి: కారు ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహన దారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. సోమందేపల్లికి చెందిన సూర్యనారాయణ (47) పాలసముద్రం వద్ద ఉన్న ఓ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆదివారం విధులు ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరుగు ప్రయాణమైన ఆయన వెలగమాకులపల్లి క్రాస్‌ సమీపంలో 44వ జాతీయ రహదారిపైకి చేరుకోగానే వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొని అక్కడికక్కడ మృతి చెందాడు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై ఎస్‌ఐ రమేష్‌బాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ద్విచక్రవాహనాలు ఢీ –

వృద్ధుడి మృతి

బొమ్మనహాళ్‌: మండలంలోని శ్రీనివాసక్యాంప్‌ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. వివరాలు.. దేవగిరి క్రాస్‌కు చెందిన కొండయ్య (75) ఆదివారం శ్రీనివాసక్యాంపు సమీపంలో పొలం పనులు చూసుకుని తన సూపర్‌ ఎక్స్‌ఎల్‌ వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. అదే సమయంలో బెంగళూరు నుంచి మంత్రాలయానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న గోవర్దన్‌ అనే వ్యక్తి ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన కొండయ్యను బళ్లారిలోని విమ్స్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన గోవర్దన్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గుత్తిలో తుపాకీ కలకలం

గుత్తి: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని జెడ్‌.వీరారెడ్డి కాలనీలో ఆదివారం గన్‌ కలకలం రేపింది. కాలనీలో ఓ ఇంటి పక్కన పడి ఉన్న గన్‌ (పిస్టల్‌)ను స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, స్వాధీనం చేసుకున్నారు. పిస్టల్‌ పురాతనమైందని, అందులో బుల్లెట్లు ఏమీ లేవని పోలీసులు తెలిపారు. పిస్టల్‌ ఎవరిదనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా మన ఊళ్లో గన్‌ కల్చర్‌ ఏమిటంటూ గుత్తి వాసులు చర్చించుకోవడం గమనార్హం.

ఆలయంలో చోరీ

కంబదూరు: మండలంలోని కదిరిదేవరపల్లిలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించిన దుండగులు సుమారు రూ.2 లక్షలు విలువ చేసే 9 వెండి గొడుగులు, 3 వెండి నాగ పడగలు, 6 వెండి కిరీటాలు, బంగారు తాళి బొట్టు గిన్నెలు, రూ.3 వేల నగదు అపహరించారు. ఆదివారం ఉదయం ఆలయంలో పూజాదికాలు చేసేందుకు వెళ్లిన అర్చకులు గమనించి సమాచారం ఇవ్వడంతో ఈఓ దేవదాసు, డీఎస్పీ రవిబాబు, సీఐ నీలకంఠేశ్వర, ఇన్‌చార్స్‌ ఎస్‌ఐ రాంభూపాల్‌ తదితరులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement