యువకుడి దుర్మరణం
తనకల్లు: మండలంలోని చీకటిమానిపల్లి పేపర్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో సింగిరివాండ్లపల్లికి చెందిన నరేష్ (28) దుర్మరణం పాలయ్యాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఐచర్ వాహనానికి డ్రైవర్‌గా వెళుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆదివారం అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన ఫ్యాక్టరీ దగ్గరకు చేరుకోగానే తిరుపతికి వెళుతున్న కేఎస్‌ఆర్టీసీ బస్పు ఢీకొనడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
జింక చర్మాల
అక్రమ రవాణా ముఠా అరెస్ట్
వజ్రకరూరు: అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జింకలను వేటాడి చంపి.. వాటి మాంసాన్ని విక్రయించడంతో పాటు చర్మాలను అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను వజ్రకరూరు పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 24 జింక చర్మాలు, రెండు కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం వజ్రకరూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ నాగస్వామి..ఫారెస్ట్ సెక్షన్ అధికారి కరీముల్లా, బీట్ ఆఫీసర్ సతీష్‌తో కలసి వివరాలు వెల్లడించారు. గుంతకల్లు పట్టణానికి చెందిన షికారి దేవరాజు, షికారి గోవిందు, అనంతపురం నగరానికి చెందిన షికారి బాబు, షికారి బాలరాజు, గుంతకల్లు మండలం ఆచారమ్మ కొట్టాలకు చెందిన వడ్డే పెద్దఅంజి గుంతకల్లు, వజ్రకరూరు, ఆలూరు, చిప్పగిరి తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో ఉచ్చులు ఏర్పాటు చేసి జింకలను వేటాడేవారు. వాటి మాంసాన్ని విక్రయించడంతో పాటు చర్మాలను కర్ణాటకలోని బళ్లారి, కంప్లి, హొస్పేట్ తదితర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేవారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 24 జింక చర్మాలు, రెండు కొమ్ములను సంచుల్లో వేసుకుని కర్ణాటక వైపు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీ శాఖ అధికారులతో కలసి వజ్రకరూరు మండలం కొనకొండ్ల సమీపంలోని బళ్లారి జాతీయ రహదారిలో వారిని పట్టుకున్నారు. నిందితులను ఆదివారం అనంతపురంలోని మొబైల్‌కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు.
జాతీయ స్థాయి
కరాటే పోటీలకు ఎంపిక
అనంతపురం: త్వరలో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ఏపీ తరఫున ప్రాతినిథ్యం వహించే క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను ఆదివారం అనంతపురంలోని అశోక్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. అండర్–14 బాలికల విభాగంలో ఎ.స్మిత (22 కేజీలు), కావ్య (24 కేజీలు), సాత్విరెడ్డి (26 కేజీలు), తేజశ్రీ (30 కేజీలు), దివ్య సాయి (38 కేజీలు), దీక్ష (42 కేజీలు), లక్ష్మి (46 కేజీలు), రిష్మిత (50 కేజీలు) ఎంపికయ్యారు. అండర్–17 విభాగంలో ఇందుమతి, జయశ్రీ, సాయి అక్షిత, లీలాంజలి, తీర్థి, భాగ్యలక్ష్మి, దీపిక, వసుధ, సింధుజ, సాకియా, నందిని చోటు దక్కించుకున్నారు. ఈ ప్రక్రియను అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రారంభించగా జిల్లా ఎస్జీఎఫ్ సెక్రెటరీ సుగుణమ్మ, పీడీలు నాగరాజు, అబ్జర్వర్ దేవకీ పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment