డ్రైవర్ల అవగాహన రాహిత్యంతోనే ఘోరం
గార్లదిన్నె: ఆర్టీసీ, ఆటో డ్రైవర్ల అవగాహన రాహిత్యంతోనే తలగాచిపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు డీటీసీ వీర్రాజు తెలిపారు. రెండు రోజుల క్రితం మండల పరిధిలోని తలగాచిపల్లి క్రాస్ వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొని ఎనిమిది మంది కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం ఘటనాస్థలాన్ని కళ్యాణదుర్గం ఆర్టీఓ రమేష్, ఎంవీఐ సునీత, డీఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి డీటీసీ వీర్రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామన్నారు. తలగాచిపల్లి క్రాస్‌లో ఏర్పాటు చేసిన స్పీడ్ బేకర్లు అరిగిపోయాయని, త్వరలో వాటి ఎత్తు పెంచి, పెయింటింగ్ వేస్తామని పేర్కొన్నారు.
ఘటన బాధాకరం..
ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది వ్యవసాయ కూలీలు చనిపోవడం బాధాకరమని మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం నుంచి గుంతకల్లు వెళ్తూ మార్గమధ్యలో తలగాచిపల్లి క్రాస్‌లో ప్రమాద స్థలాన్ని ఆమె పరిశీలించారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ రహదారులపై ప్రమాద సూచికలు ఏర్పాటు చేసి, రోడ్డు నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో శింగనమల సర్కిల్ సీఐ కౌలుట్లయ్య, గార్లదిన్నె ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా, హైవే ప్రాజెక్టు అధికారి వలి, ఇంజినీర్లు భరత్, అమీన్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
డీటీసీ వీర్రాజు
Comments
Please login to add a commentAdd a comment