అనంతపురం అగ్రికల్చర్: బ్రూసెల్లోసీస్ వ్యాధి నివారణలో భాగంగా 4 నుంచి 8 నెలల వయస్సున్న పెయ్య దూడల (ఆవు, గేదెలకు సంబంధించి)కు ఉచితంగా టీకాలు వేయనున్నారు. ఈ మేరకు పశుసంవర్ధకశాఖ రెండు జిల్లాల జేడీలు డాక్టర్ జీపీ వెంకటస్వామి, డాక్టర్ జి.శుభదాస్, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (ఏడీ డీఎల్) ఏడీ డాక్టర్ ఎన్.రామచంద్ర ఆదివారం తెలిపారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా 6,750 డోసులు, శ్రీసత్యసాయి జిల్లాలో 6,050 డోసుల మందు అందుబాటులో ఉందన్నారు. ఈ ఏడాది ఇప్పటికే తొలి విడతగా 20,150 పెయ్యదూడలకు బ్రూసెల్లోసీస్ టీకాలు ఉచితంగా వేసినట్లు తెలిపారు. రెండో విడతగా డిసెంబర్ 19 వరకు 13,800 పెయ్య దూడలను గుర్తించి వాటికి అవసరమైన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. బ్రూసెల్లోసీన్ వ్యాధి సోకితే పశువుల్లో జ్వరం, బలహీనత,, చూడి కట్టిన పశువులు ఆఖరి దశలో అబార్షన్ కావడం, మాయ వేయకపోవడం, గర్భస్రావాలు, చూడి నిలబడకపోవడం, మగ పశువులలో వృషణాల వాపు, కీళ్ల వాపు, వ్యంధత్వం లాంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. వ్యాధి సోకిన పశువుల గర్భస్రావాలు, మాయ, పాల ద్వారా ఇతర పశువులుకు, అలాగే మనుషులకు కూడా వ్యాధి సోకే ప్రమాదముందన్నారు. వ్యాధి నివారణలో భాగంగా 4 నుంచి 8 నెలల వయస్సున్న దూడలకు ముందస్తుగా ఉచితంగా టీకాలు వేయించుకోవాలని రైతులకు సూచించారు. పాలను బాగా మరిగించి వాడుకోవాలన్నారు. వ్యాధిగ్రస్థ పశువు మిగిల్చిన మేత, పేడ, మాయ, గర్భస్రావం లాంటి వాటిని గుంత తవ్వి పూడ్చివేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment