రామగిరిలో పచ్చ ప్రతాపం!
● రామగిరి మండలం కుంటిమద్దికి చెందిన నాయీబ్రాహ్మణుడు రామాంజనేయులు గ్రామంలో 20 ఏళ్లుగా రోడ్డు పక్కన చిన్న బంకు పెట్టుకుని కులవృత్తి చేసుకుంటున్నాడు. ఇటీవల పోలీసులు బంకును ఎత్తివేయాలని రామాంజనేయులుకు తెలిపారు. తన జీవనాధారం పోతుందని ఆయన బతిమిలాడినా పట్టించుకోలేదు..పైగా ‘టీడీపీ వారితో చెప్పించు’ అంటూ ఉచిత సలహా ఇచ్చారు.
● కొండాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు తలారి రమేష్, బోయసూరి, మంత్రాల అనిల్‌కుమార్, పూజారి చంద్రమోహన్, జంబో రమేష్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల వారిని స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు గుప్తనిధులు తవ్వుతున్నారని తమకు సమాచారం వచ్చిందని భయపెట్టారు. రోజూ స్టేషన్ వద్దకు పిలిపిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు.
● పాపిరెడ్డిపల్లికి చెందిన జయచంద్రారెడ్డి గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కోసం పనిచేశారు. దీంతో కూటమి ప్రభుత్వం రాగానే టీడీపీ నేతలు ఆయన్ను లక్ష్యంగా చేసుకున్నారు. చివరకు ఆయన పొలంలో పనిచేసేందుకు ఎవరూ వెళ్లకూడదంటూ గ్రామస్తులను భయపెట్టారు. దీంతో ఆయన మరో గ్రామం నుంచి కూలీలను రప్పించుకుంటున్నారు.
...ఇలా రామగిరి మండలంలో టీడీపీ నేతలు చేస్తున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయ కక్షతో భౌతికదాడులకు దిగుతున్నారు. లేకపోతే పోలీసుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పిస్తూ భయపెడుతున్నారు.
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : ‘‘ఇది రాప్తాడు. ఇక్కడ మేం చెప్పిందే వేదం. మేం చేసిందే చట్టం. మా మాట వినకపోతే మీ జీవితాలు అంతే. కేసులు మోసుకొంటావా... పార్టీలోకి వస్తావా’’ అంటూ టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ నేతలు, సానుభూతి పరులపై కక్షసాధింపులకు దిగుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా ‘పచ్చ’మంద ప్రతాపం చూపుతుండగా...సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పరిటాల సొంత మండలం రామగిరిలో తమ్ముళ్ల దాష్టీకాలకు అంతేలేకుండా పోయింది. ఇప్పటికే చాలా మంది వైఎస్సార్ సీపీ నేతలు, సానుభూతి పరులు ఊళ్లు విడిచి వెళ్లిపోగా..ఉన్నవాళ్లపై పరిటాల అనుచరులు ప్రతాపం చూపుతున్నారు. భౌతికదాడులు చేయడంతో పాటు ఆస్తులు ధ్వంసం చేస్తూ రౌడీ రాజ్యాన్ని తలపిస్తున్నారు.
పట్టుకోసం పాకులాట..
పరిటాల సునీత సొంత మండలం రామగిరిలో తొమ్మిది పంచాయతీలుండగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏడు పంచాయతీల్లో తొమ్మిది ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు జయకేతనం ఎగుర వేశారు. మండలంలో ఎక్కడికి వెళ్లినా వైఎస్సార్ సీపీ జెండాలు రెపరెపలాడుతుండటంతో ‘పరిటాల’ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టుకోసం పాకులాడుతోంది. ఇప్పటికే పలువురు వైఎస్సార్ సీపీ నేతలను భయపెట్టి పచ్చ కండువాలు వేసింది. ఇంకొందరిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది.
పోలీసుల ద్వారా వేధింపులు..
తమ మాట వినని వారిపై పరిటాల కుటుంబం పోలీసులను ప్రయోగిస్తోంది. రామగిరి పోలీసులు కూడా విచక్షణ మరచి ‘మేడం’ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తూ సామాన్యులను వేధింపులకు గురి చేస్తున్నారు. గుప్త నిధులు తవ్వుతున్నారని, మట్కా, పేకాట ఆడుతున్నారని, మద్యం, ఇసుక తరలిస్తున్నారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడమే ఆలస్యం... కనీస విచారణ కూడా చేపట్టకుండానే వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇదెక్కడి అన్యాయం సార్ అని ఎవరైనా ప్రశ్నిస్తే తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. రోజూ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటూ మానసికంగా వేధిస్తున్నారు. ‘టీడీపీలో చేరు..ఐదేళ్లు హాయిగా ఉండొచ్చు’ అంటూ బాధితులకు ఉచిత సలహా ఇస్తున్నారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే టీడీపీకి వంతపాడుతూ దౌర్జన్యాలకు దిగితే తమకు దిక్కెవరంటూ జనం గగ్గోలు పెడుతున్నారు.
రాజకీయ కక్షతో సామాన్యులపై జులుం
గ్రామాల్లో భయాందోళనలు
సృష్టిస్తున్న టీడీపీ నేతలు
వైఎస్సార్ సీపీ నేతలు,
సానుభూతిపరులే లక్ష్యంగా దాడులు
అక్రమ కేసులు నమోదు చేయాలంటూ పోలీసులపై ఒత్తిళ్లు
చేయని తప్పులను ‘ఒప్పుకోవాలంటూ’ పోలీసుల కోటింగ్
రోజూ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి
కేసుల బెదిరింపులు
Comments
Please login to add a commentAdd a comment