అంబేడ్కర్‌ వర్సిటీ ప్రత్యేకాధికారిగా సామ్రాజ్యలక్ష్మి | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ వర్సిటీ ప్రత్యేకాధికారిగా సామ్రాజ్యలక్ష్మి

Published Thu, Oct 24 2024 12:57 AM | Last Updated on Thu, Oct 24 2024 12:57 AM

అంబేడ

అంబేడ్కర్‌ వర్సిటీ ప్రత్యేకాధికారిగా సామ్రాజ్యలక్ష్మి

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఆంధ్రా విశ్వవిద్యాలయం విశ్రాంత ఉద్యోగి కె.సామ్రాజ్యలక్ష్మిని ఎచ్చెర్లలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు బుధవారం ఆమె విధుల్లో చేరారు. పరిపాలన, ఆర్థిక, పరీక్షల నిర్వహణ అంశాలను ఎస్‌ఓ హోదాల్లో పర్యవేక్షించనున్నారు. ఈమె ఏయూలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌, జాయింట్‌ రిజిస్ట్రార్‌, ఫైనాన్స్‌ అధికారిగా, నూజివీడు ఆర్‌జీయూకేటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ వంటి బాధ్యతలు నిర్వర్తించారు.

త్వరలో వైఎస్సార్‌ సీపీ జిల్లా కమిటీలు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్‌ సీపీ జిల్లాస్థాయిల కమిటీలను త్వరలోనే ఎంపిక చేయనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పరిశీలకులతో పెద్దపాడులోని ధర్మాన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్‌ మాట్లాడుతూ జిల్లా కమిటీలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. పార్టీ అనుబంధ కమిటీలు, ఆఫీసు బేరర్లు, యువజన విభాగం, విద్యార్థి, రైతు, ట్రేడ్‌ యూనియన్‌ తదితర విభాగాలను పటిష్టం చేస్తామన్నారు. అన్ని కమిటీల్లోనూ నియోజకవర్గాలకు సమ ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. వీలైనంత త్వరగా కమిటీలు నియమించి ప్రకటించాలని తీర్మానించారు. సమావేశంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌, టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌, పిరియా సాయిరాజ్‌, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఎం.వి.పద్మావతి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రౌతు శంకరరావు, అంబటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

జలుమూరు: తిలారు రైల్వే గేట్‌ సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ షరీఫ్‌ బుధవారం తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో బసివాడకు–తిలారు గేటు మధ్య గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతుడి వద్ద లభించిన ఆధార్‌ కార్డు ప్రకారం పోలాకి మండలం ఈదులువలస గ్రామానికి చెందిన కొర్ను శ్రీనివాసరావుగా గుర్తించారు. మృతుడికి భార్య, ఏడాది కొడుకు, తల్లిదండ్రులు, సోదరుడు ఉన్నారు. జేబులో ఉన్న ఫోన్‌ నంబర్‌ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు రైల్వే హెచ్‌సీ చక్రధర్‌రావు తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించినట్లు ఎస్‌ఐ షరీఫ్‌ తెలిపారు.

రేపు జాబ్‌మేళా

శ్రీకాకుళం న్యూకాలనీ: బలగ హాస్పటల్‌ జంక్షన్‌లో ఉన్న డీఎల్‌టీసీ/ఐటీఐ శిక్షణా కేంద్రంలో ఈ నెల 25న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఎల్‌టీసీ ఏడీ వై.రామ్మోహన్‌రావు, ఏపీఎస్‌ఎస్‌డీసీ జిల్లా అధికారి వై.సాయికుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మోండలెజ్‌ ఇండియా ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎన్‌ఎస్‌ ఇనుస్ట్రుమెంట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, కోల్గేట్‌ పాల్మొలివ్‌, అపోలో టైమ్స్‌ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని, వివరాలకు 70957 31303 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

న్యాయవిద్యకు బీసీఐ అనుమతి

ఎచ్చెర్ల క్యాంపస్‌: అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలోని మహాత్మా జ్యోతీరావుఫూలే న్యాయ కళాశాలలో మూడేళ్ల న్యాయ విద్య ప్రవేశాలకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు లభించిందని వీసీ కె.ఆర్‌.రజిని బుధవారం చెప్పారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని ఫ్యాకల్టీ సభ్యులకు అందజేశారు. నిబంధనలు మేరకు ఫీజు చెల్లించి కమిటీని ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రస్తుతం పూర్తిస్థాయి ప్రవేశాలతో కోర్సు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రెక్టార్‌ బి.అడ్డయ్య, కోర్సు కో–ఆర్డినేటర్‌ వై.రాజేంద్రప్రసాద్‌, ఫ్యాకల్టీ సభ్యులు జి.మన్మధరావు, టి.బాలకృష్ణ, కె.చిన్నంనాయుడు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అంబేడ్కర్‌ వర్సిటీ ప్రత్యేకాధికారిగా సామ్రాజ్యలక్ష్మి 1
1/2

అంబేడ్కర్‌ వర్సిటీ ప్రత్యేకాధికారిగా సామ్రాజ్యలక్ష్మి

అంబేడ్కర్‌ వర్సిటీ ప్రత్యేకాధికారిగా సామ్రాజ్యలక్ష్మి 2
2/2

అంబేడ్కర్‌ వర్సిటీ ప్రత్యేకాధికారిగా సామ్రాజ్యలక్ష్మి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement