అపురూపంగా బాలియాత్ర
● వంశధార తీరానికి పోటెత్తిన భక్తులు
● సాయంత్రం నుంచి రాత్రి వరకూ
దీపోత్సవం
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బాలియాత్ర అపురూప రీతిలో సాగింది. యాత్ర సందర్భంగా వంశధార నది తీరం భక్త జనసంద్రమైంది. సా యంత్రం ప్రారంభమైన ఈ యాత్ర రాత్రి వరకూ కొనసాగింది. పూర్ణ కుంభంతో బాలి యాత్ర ప్రారంభం చేశారు. అర్చకులు, పురోహితులు వేద మంత్రోచ్ఛరణల నడుమ మంగళహారుతులిస్తూ స్వామిని కీర్తిస్తూ వంశధార నదికి చేరుకున్నారు. దీనికి ముందు బాలి యాత్ర చరిత్ర, కళింగ రాజ్యం స్థాపన, నాటి పరిపాలన, నౌకాయానం తదితర విషయాలను నిర్వాహక కమిటీ ప్రతినిధి దువ్వాడ జీవితేశ్వరరావు భక్తులకు మైకులో వివరించారు. అనంతరం భక్తులు నదిలో అరటి దొప్పలపై దీపాలు విడిచిపెట్టారు.
ముందుగా జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణి, స్థానిక ఎమ్మెల్యే బగ్గు ఎమ్మెల్యే రమణ మూర్తి సతీమణి సుగణమ్మలు ఖారవేల ఘాట్‌లో దీపాలు విడిచిపెట్టారు. అనంతరం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, టెక్కలి నియో జకవర్గం వైఎస్సార్‌సీపీ కన్వీనర్ పేరాడ తిలక్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్‌లు కూడా దీపాలు విడిచిపెట్టారు. అర్చకులు నదికి నక్షత్ర,కుంభ,అష్టాదశ హారతులిచ్చారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ యాత్రను ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని స్థానికులు కోరారు. ఒడిశాలో అధికారికంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని భక్తులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ టి.సతీష్ కుమార్, ఎంపీటీసీ కె.హరి ప్రసాద్, ఎం.బసవ వెంకట రమణ, ఎం.శ్యామలరావు తోపాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment