విధుల్లో చేరిన ఎస్‌బీ డీఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా స్పెషల్ బ్రాంచి డీఎస్పీగా జి.సీతారామారావు సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈయన సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడికి వచ్చారు. అనంతరం ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
బాధ్యతలు స్వీకరించిన అడిషనల్ ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు శాఖ అదనపు ఎస్పీ (అడ్మిన్ విభాగం)గా కె.వి.రమణ సోమవారం ఉదయం తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇంతకుముందు పనిచేసిన అదనపు ఎస్పీ డాక్టర్ జి.ప్రేమ్‌కాజల్ బదిలీ అయిన సంగతి తెలిసిందే. కె.వెంకటరమణ కోనసీమ జిల్లా కొత్తపేట ఎస్‌డీపీవో (డీఎస్పీ)గా ఉంటూ ఇటీవలే అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది, రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చారు. 1991 ఎస్‌ఐ బ్యాచ్‌కు చెందిన ఈయన విశాఖ సిటీలో ఎక్కువ కాలం పనిచేశారు.
విభిన్న ప్రతిభావంతులకు ఆటల పోటీలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో గల విభిన్న ప్రతిభావంతులకు కేటగిరీల వారీగా సీ్త్ర, పురుషులకు వేరు వేరుగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్టు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఏడీ కె.కవిత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు కలెక్టరేట్ దగ్గరలో, డి.ఆర్.డి.ఎ కాంప్లెక్స్ ఎదురుగా గల, డచ్ భవనం ఎదురు మైదానంలో ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తామని తెలిపారు.
డిగ్రీ మూడో సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు ప్రారంభం
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ మూడో సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సీనియర్ అధ్యాపకులను ఎగ్జామినర్లుగా జంబ్లింగ్ పద్ధతిలో నియమించినట్లు అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్‌చార్జి డీన్ జి.పద్మారావు చెప్పారు.
పలు అంశాల్లో విద్యార్థులకు పోటీలు
ఎచ్చెర్ల క్యాంపస్: సంకల్పం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించనున్నట్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పి.సుజాత అన్నారు. వర్సిటీ నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగం, గంజాయి వినియోగం, చిన్నారులు, మహిళలపై జరగుతున్న అఘాయిత్యాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, సైబర్ క్రైమ్ వంటి అంశాలపై పోస్టర్ తయారీ, వీడియో లఘుచిత్రాలు అంశంపై పోటీ ఉంటుందని చెప్పారు. ఈ నెల 25వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, నోడల్ అధికారి జేఎల్ సంధ్యారాణి ఫోన్ నంబర్ 9866027906లను సంప్రదించాలని అన్నారు.
ఎస్‌జీటీ ఓవరాక్షన్‌పై ఫిర్యాదు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో పలాస మండల పరిధిలోని ఎంపీయూపీ స్కూల్‌లో ప్రస్తుతం సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న తమ్మినాన శ్రీనివాసరావు డీఈవో కార్యాలయంలో చేసిన ఓవరాక్షన్‌పై ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ జిల్లాశాఖ (ఏపీఎస్‌ఈఎస్‌ఏ) ప్రతినిధులు మండిపడుతున్నారు. ఈనెల 7వ తేదీన సదరు ఎస్‌జీటీ శ్రీనివాసరావు డీఈవో కార్యాలయానికి వచ్చి నాన్ టీచింగ్ స్టాఫ్‌పై దుర్భాషలాడుతూ దౌర్జన్యంగా ప్రవర్తించినట్లు సంఘ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఎంపీయూపీ స్కూల్ పెద్దరోకల్లపల్లి ఎస్‌జీటీగా పనిచేస్తున్న సమయంలో మరో ఉపాధ్యాయుడితో జరిగిన ఘర్షన కారణంగా శ్రీనివాసరావు సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఘర్షణ జరిగిన మరో ఉపాధ్యాయుడి పోస్టింగ్‌కు అనుకూలంగా డీఈవో కార్యాలయ సిబ్బంది పనిచేశారనే నెపంతో వారిపై విరుచుకుపడ్డారు. వారి అంతు చూస్తానని.. వారి అందరిపై లెటర్‌రాసి చస్తానంటూ భయపెట్టడంతో విషయాన్ని డీఈవో డాక్టర్ తిరుమల చైతన్య దృష్టికి తీసుకెళ్లారు. సంఘటన జరిగి రెండు వారాలు కావొస్తున్నా సదరు ఉపాధ్యాయుడిపై డీఈవో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధులు(ఏపీఎస్‌ఈఎస్‌ఏ) జిల్లా కలెక్టర్‌ను ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లియాకత్ ఆలీఖాన్, గోపాలకృష్ణ త్రిపాఠి, ఆరుగు పట్నాయక్, సూర్యప్రకాష్, రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment