మహిళలు పైలెట్లుగా ఉండాలి
● కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
శ్రీకాకుళం న్యూకాలనీ: మహిళలు పైలట్లగా ఉండాలనే సరికొత్త లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని కేంద్ర పౌర విమానయానశాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉమెన్ ఇన్ ఏవియేషన్ ఇండియా ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉమెన్ ఏవియేషన్ డే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎక్కడున్నా.. ఏ రంగంలో ఉన్నా కష్టపడి పనిచేస్తారన్నారు. దీనికి మరింత నైపుణ్యం జోడిస్తే అన్ని రంగాల్లో రాణించవచ్చని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 5 శాతం మంది మాత్రమే మహిళా పైలెట్లు ఉండగా, భారతదేశంలో 15 శాతం మంది ఉండడం గొప్ప విషయమన్నారు ‘బేటీ కీ ఉడాన్.. దేశ్ కా స్వాభిమాన్’ అనేది విమానయాన శాఖ ధ్యేయమని, యువతులను విమానయాన శాఖలోని మరిన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుతో పాటు మూలపేట పోర్టు నిర్మాణం పూర్తయితే జిల్లాలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఉమెన్ ఇన్ ఏవియేషన్ ఇండియా సంస్థ ఉపాధ్యక్షురాలు కమల చక్రవర్తి, సభ్యులు అంజలి చౌహా, అర్చన, కీర్తి తివారి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు, వైస్ ప్రిన్సిపాల్ పి.శంకర్‌నారాయణ, సీహెచ్ కృష్ణారావు, పద్మావతి, మెట్ట సుజాత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment